గాన కోకిల లతా మంగేష్కర్ అంత్యక్రియలు అధికారిక లాంఛనాల నడుమ ముగిశాయి. ముంబైలోని శివాజీ పార్క్‌లో వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ఆమె సోదరుడు హృదయనాథ్ మంగేష్కర్ ఆమెకు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్, శరద్ పవార్ లాంటి రాజకీయ నేతలు, క్రికెటర్ సచిన్ టెండుల్కర్, నటులు షారూఖ్, అమీర్ ఖాన్, రణవీర్ కపూర్‌తో పాటు పలు రంగాల ప్రముఖులు, కుటుంబ సభ్యులు, అభిమానులు…. అందరూ శివాజీ పార్క్‌కు తరలివచ్చి, కన్నీటి వీడ్కోలు పలికారు. ఇన్ని రోజుల పాటు తమ సోదరి లతా మంగేష్కర్ తమతోనే వుండేవారని, ఇప్పుడు ఆమె లేరని, తాము ఒంటరయ్యామని సోదరుడు, కుటుంబీకులు తీవ్ర ఆవేదన చెందారు.
భారత్న రత్న లతా మంగేష్కర్ అంత్యక్రియలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఆమె భౌతికకాయానికి ప్రధాని మోదీ నివాళులర్పించారు. నివాళులర్పించిన తర్వాత లతా మంగేష్కర్ కుటుంబీకులు, వైద్యులతో కాసేపు మాట్లాడారు. ఆ తర్వాత సీఎం ఉద్ధవ్, ఆయన భార్య, మంత్రి ఆదిత్యతో కూడా కాసేపు సంభాషించారు. మోదీ తర్వాత… మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోషియారీ, మంత్రి ఆదిత్య, సీఎం ఉద్ధవ్, డిప్యూటీ సీఎం అజిత్ పవార్, క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తదితరులు లతా భౌతికకాయానికి నివాళులర్పించారు. మరో వైపు శివాజీ పార్క్‌కు లతా అభిమానులు, రాజకీయ నేతలు, సినీప్రముఖులు భారీగా తరలివచ్చారు.