హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): చంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండింగ్ కార్యక్రమాన్ని టీ-శాట్ నెట్వర్ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నది. బుధవారం సాయంత్రం 4.30 నుంచి 6.30 గంటల వరకు రెండు గంటల పాటు చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ సురక్షితంగా చంద్రడిపై వాలిపోయే అద్భుత ఘట్టాన్ని తమ చానళ్లల్లో ప్రసారం చేయనున్నట్టు టీ -శాట్ సీఈవో రాంపురం శైలేశ్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ‘చంద్రయాన్-3 మిషన్ లైవ్ ల్యాండింగ్ ఎక్స్పీరియన్స్’ పేరుతో ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్ ఎన్ఆర్ఎస్ఈ రిటైర్డ్ డైరెక్టర్ శశికాంత్ సాల్వీ, ప్లానెటరీ సొసైటీ అఫ్ ఇండియా డైరెక్టర్ ఎన్ రఘనందన్ కుమార్, ఓయూ ఎలక్ట్రానిక్స్ విభాగం డైరెక్టర్ ప్రొఫెసర్ నవీన్‌కుమార్, ఓయూ అస్ట్రానమీ విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ కే చెన్నారెడ్డి ఈ చర్చలో పాల్గొంటారని తెలిపారు. పాఠశాలల విద్యార్థులు టీశాట్ ప్రసారాన్ని వినియోగించుకోవాలని విద్యాశాఖను కోరినట్టు సీఈవో శైలేశ్‌రెడ్డి తెలిపారు.