పాట్నా : ‘బాధ్యతా రాహిత్య ప్రవర్తన’ కారణంగా తన పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్‌ను(37) పార్టీ నుంచి ఆరేండ్ల పాటు బహిష్కరిస్తున్నట్టు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆదివారం ప్రకటించారు. అతడితో అన్ని కుటుంబ సంబంధాలూ తెంచుకుంటున్నట్టు తెలిపారు. ‘వ్యక్తిగత జీవితంలో నైతిక విలువలను విస్మరించడం సామాజిక న్యాయం కోసం మనమంతా చేసిన సమష్టి కృషిని బలహీనపరుస్తుంది. నా పెద్ద కొడుకు చేస్తున్న పనులు, అతడి ప్రవర్తన, బాధ్యతా రాహిత్యం మా కుటుంబ విలువలు, సంప్రదాయాలకు అనుగుణంగా లేవు. ఈ కారణాల వల్ల అతడిని పార్టీ, కుటుంబం నుంచి బహిష్కరిస్తున్నా.
ఇక నుంచి పార్టీ, కుటుంబంలో అతడికి ఎలాంటి బాధ్యత ఉండదు. ఆరేండ్ల పాటు అతడిని పార్టీ నుంచి బహిష్కరించాను’ అని లాలూ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. తానొక యువతితో ‘సంబంధం’ కలిగి ఉన్నానని తేజ్ ప్రతాప్ ఫేస్బుక్లో పోస్ట్ పెట్టిన మరుసటి రోజే ఈ పరిణామం చోటు చేసుకుంది. అయితే తన ఫేస్బుక్ ఖాతా హ్యాక్ అయిందని.. తన ఫొటోలను ఎవరో తప్పుగా ఎడిటింగ్ చేశారని శనివారం రాత్రి ఆయన తెలిపారు. అయితే ఈలోగా తేజ్ ప్రతాప్ చేసిన రిలేషన్షిప్ పోస్ట్ వైరలైంది. తేజ్ ప్రతాప్ గతంలో బీహార్ మాజీ సీఎం దరోగా రాయ్ మనవరాలు ఐశ్వర్యను పెండ్లి చేసుకున్నారు.