న్యూఢిల్లీ: లేడీ డాన్(Lady Don) జోయా ఖాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆమె వద్ద నుంచి కోటి రూపాయల విలువైన హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదకర గ్యాంగ్‌స్టర్ హషిమ్ బాబా భార్యే జోయా ఖాన్. ఆమె వద్ద ఉన్న సుమారు 270 గ్రాముల హెరాయిన్‌ను పోలీసులు పట్టుకున్నారు. అంత్జాతీయ మార్కెట్లో దాని విలువ కోటి ఉంది. జోయా వయసు 33 ఏళ్లు. భర్త హషిమ్ బాబా జైలులో ఉన్నా.. అతనికి ఉన్న లింకులతోనే జోయా ఖాన్ అక్రమ కార్యకలాపాలు సాగించింది.
గ్యాంగ్‌స్టర్ హషిమ్పై డజన్ల సంఖ్యలో కేసులు ఉన్నాయి. మర్డర్, బెదిరింపులు, ఆయుధాల స్మగ్లింగ్ లాంటి కేసులు ఉన్నాయి. అతని మూడవ భార్య జోయా. అయితే 2017 అతన్ని పెళ్లి చేసుకోవడానికి ముందు ఆమె మరో వ్యక్తిని వివాహమాడింది. ఆ వ్యక్తికి విడాకులు ఇచ్చిన తర్వాతే బాబాతో కాంటాక్ట్‌లోకి వచ్చింది. నార్త్ ఈస్ట్ ఢిల్లీలో ఆ ఇద్దరి మధ్య పరిచయం, ప్రేమాయణం సాగింది.
బాబాను జైల్లో వేయగానే.. అతని ఆపరేషన్స్ అన్నీ జోయా చూసుకున్నది. అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సోదరి హసీనా పార్కర్తోనూ జోయాకు లింకులు ఉన్నాయి. బెదిరింపులు, డ్రగ్స్ దాందాలో జోయా ఆరితేరినట్లు ఢిల్లీ పోలీసు శాఖ స్పెషల్ సెల్ పేర్కొన్నది. చాలా హై ప్రోఫైల్ పార్టీలకు జోయా వెళ్లేది. ఖరీదైన దుస్తులు ధరించేది. లగ్జరీ బ్రాండ్లు మాత్రమే వాడేది. ఆమెకు సోషల్ మీడియాలో భారీగా ఫాలోయింగ్ ఉంది.
తీహార్ జైలులో ఉన్న భర్త హషీమ్ బాబాను తరుచూ జోయా కలుసుకునేది. కోడ్ లాంగ్వేజ్‌లో జోయాకు బాబా శిక్షణ ఇచ్చినట్లు తెలుస్తోంది. గ్యాంగ్ ఆర్థికలావాదేవీలు, ఆపరేషన్స్ ఎలా మెయిన్టేన్ చేయాలన్న దానిపై ఆమెకు సలహాలు, సూచనలు ఇచ్చేవాడు. జైలు బయట ఉన్న బాబా గ్యాంగ్ క్రిమినల్స్‌తో జోయా నేరుగా కాంటాక్ట్‌లో ఉండేది. జోయాను పట్టుకునేందుకు ఢిల్లీకి చెందిన స్పెషల్ సెల్, క్రైం బ్రాంచ్ పోలీసులు తీవ్రంగా కష్టపడ్డారు. అయితే చివరకు ఇంటెలిజెన్స్ సాయంతో జోయాను అరెస్టు చేశారు. భారీ స్థాయిలో హెరాయిన్‌తో ఆమెను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. యూపీలోని ముజాఫర్‌నగర్ నుంచి ఆ డ్రగ్స్ సరఫరా అయినట్లు తేలింది.
నదీర్ షా మర్డర్ కేసులో నిందితులుగా ఉన్న షూటర్లకు జోయా రక్షణ కల్పించినట్లు ఆరోపణలు ఉన్నాయి. గ్రేటర్ కైలాష్ ఏరియాలో జిమ్ ఓనర్ అయిన నదీర్ షాను 2024 సెప్టెంబర్‌లో కాల్చి చంపిన విషయం తెలిసిందే. జోయా తల్లి కూడా జైలు పాలైంది. సెక్స్ ట్రాఫికింగ్ కేసులో ఆమెను గత ఏడాది అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆమె బెయిల్‌పై ఉన్నది. ఆమె తండ్రి కూడా డ్రగ్స్ సరఫరా గ్రూపులతో టచ్‌లో ఉన్నాడు. నార్త్ ఈస్ట్ ఢిల్లీలో వేర్వేరు లొకేషన్ల నుంచి ఆమె తన గ్యాంగ్‌ను ఆపరేట్ చేసింది.