న్యూఢిల్లీ : నో యువర్ వెహికిల్ (కేవైవీ) ప్రాసెస్ లేకుండానే కొత్త కార్లు, జీపులు, వ్యాన్లకు ఫాస్టాగ్‌ను జారీ చేయనున్నట్లు భారత జాతీయ రహదారుల అథారిటీ (ఎన్హెచ్ఏఐ) ప్రకటించింది. ఈ విధానం వచ్చే నెల 1 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. ఫాస్టాగ్ యాక్టివేషన్ తర్వాత కేవైవీ నిబంధనల కారణంగా లక్షలాది మంది సామాన్య వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంది.
చెల్లుబాటయ్యే వాహన పత్రాలు ఉన్నప్పటికీ వీరు అసౌకర్యానికి గురవుతున్నట్లు తెలిపింది. కార్లకు ఇప్పటికే జారీ అయిన ఫాస్టాగ్స్‌కు కేవైవీ అవసరం లేదని చెప్పింది. ఫాస్టాగ్ సరిగ్గా అతుక్కోకపోవడం, తప్పుగా ఫాస్టాగ్‌ను జారీ చేయడం, దుర్వినియోగపరచడం వంటి ఫిర్యాదులు వచ్చినపుడు మాత్రమే కేవైవీ అవసరమవుతుందని తెలిపింది. ఫిర్యాదులు లేకపోతే, ప్రస్తుత కార్ ఫాస్టాగ్స్‌కు కేవైవీ అవసరం లేదని స్పష్టం చేసింది.