బెంగళూరు, అక్టోబర్ 13, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): హిందీ భాషను బలవంతంగా రుద్దాలన్న ప్రయత్నం దేశ సమగ్రతకు ముప్పని జేడీఎస్ నేత, కర్ణాటక మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి ఆందోళన వ్యక్తంచేశారు. కేంద్రం కుతంత్రాన్ని తిప్పికొట్టేందుకు దక్షిణాది రాష్ర్టాలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. బెంగళూరులో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హిందీని రుద్దేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్షా కమిటీ చేసిన సిఫారసులు దేశం ముక్కచెక్కలయ్యేందుకు దారితీస్తుందని హెచ్చరించారు. ఒకే దేశం, ఒకే మతం, ఒకే భాష అనే విచ్ఛిన్నకర విధానంతో బీజేపీ దేశం మొత్తాన్ని తన గుప్పెట్లో బంధించేందుకు ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు.
అమిత్షా సిఫారసులు దేశ సమాఖ్య వ్యవస్థను నాశనం చేస్తాయని చెప్పారు. కేంద్రం నియంతృత్వ ధోరణితో ప్రాంతీయ భాషల్ని తుడిచిపెట్టి హిందీని బలవంతంగా రుద్ది.. బహుళ భాషలు, సంస్కృతుల దేశాన్ని ‘హిందిస్థాన్’గా మార్చేందుకు కుట్ర పన్నుతున్నదని విమర్శించారు. కేంద్రం వెంటనే ఆ నివేదికను ఉపసంహరించుకోవాలని, అన్ని భాషలను సమానంగా చూడాలన్న రాజ్యాంగ ఆశయాన్ని పరిరక్షించాలని డిమాండ్చేశారు. నిజానికి హిందీ ప్రాంతాల్లో కూడా ఆ భాష మాట్లాడేవారి సంఖ్య తక్కువ అని చెప్పారు. వాస్తవాన్ని ఎరుగకుండా హిందీని దేశం మొత్తం రుద్దేందుకు ప్రయత్నిస్తున్నారని కుమారస్వామి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇది త్రిభాషా సూత్రానికి తిలోదకాలిచ్చే కుట్ర అని, ఆర్య సంస్కృతిని తమపై మోపితే సహించబోమని హెచ్చరించారు. ప్రాంతీయ భాషల అంతానికి కేంద్రం ఎసరు పెట్టిందని ధ్వజమెత్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అమిత్షా సిఫారసులు అమలు కారాదని, దక్షిణాది రాష్ర్టాలు కలిసికట్టుగా వ్యతిరేకించాలని కోరారు.