న్యూఢిల్లీ: మథురలోని కృష్ణ జన్మభూమి(Krishna Janmabhoomi) ఆలయ వివాదాస్పద స్థలంలో ఉన్న షాహీ ఈద్గా మసీదు ఆవరణలో సర్వే చేపట్టాలన్న అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధిస్తూ ఇటీవల సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ కేసులోనే స్టేను పొడిగిస్తూ ఇవాళ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది.
షాహీ ఈద్గా మసీదు ట్రస్టు కమిటీ వేసిన పిటీషన్ను ఏప్రిల్ తొలి వారంలో విచారణ చేపట్టనున్నట్లు కోర్టు చెప్పింది. ఈ కేసులో పెండింగ్లో ఉన్న అన్ని పిటీషన్లను ఏప్రిల్లోనే విచారణకు స్వీకరించనున్నట్లు ధర్మాసనం తెలిపింది. కోర్టు పర్యవేక్షణలో మసీదులో సర్వే చేపట్టాలని గత ఏడాది డిసెంబర్ 14వ తేదీన అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ ఆదేశాలపై జనవరి 16వ తేదీన సుప్రీంకోర్టు మధ్యంతర స్టే ఇచ్చింది.