కోల్‌కతా/న్యూఢిల్లీ: కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకొన్నది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సంజయ్ రాయ్‌ను శనివారం కోర్టు ముందు ప్రవేశపెట్టిన సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. పాలీగ్రాఫ్ టెస్ట్(లై డిటెక్టర్ టెస్ట్)కు ఎందుకు అంగీకరించావని మేజిస్ట్రేట్ వేసిన ప్రశ్నతో సంజయ్ రాయ్ కన్నీరుమున్నీరు అయ్యాడు.
జడ్జి ప్రశ్నకు సమాధానం ఇస్తూ తాను నిర్దోషినని, తనపై తప్పుడు కేసు మోపారని తెలిపాడు. కాగా, సంజయ్ రాయ్‌కు పాలీగ్రాఫ్ పరీక్ష నిర్వహించేందుకు జిల్లా కోర్టు ఈ సందర్భంగా అనుమతించింది. కోర్టు నుంచి అనుమతి, పరీక్ష చేయాల్సిన వ్యక్తి సమ్మతి తీసుకొన్న తర్వాతనే ఈ లై డిటెక్టర్ టెస్టును నిర్వహించాల్సి ఉంటుంది.
ఏడుగురికి ‘లై డిటెక్షన్’ టెస్టులు
ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌తోపాటు మరో ఆరుగురికి శనివారం పాలీగ్రాఫ్ టెస్టులు ప్రారంభమయ్యాయని అధికారులు వెల్లడించారు. సంజయ్ రాయ్‌కు అతన్ని ఉంచిన జైల్లో ఈ పరీక్షను నిర్వహిస్తుండగా, ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్, హత్యాచార ఘటన జరిగిన రాత్రి డ్యూటీలో ఉన్న నలుగురు డాక్టర్లు, పౌర వలంటీర్‌కు కోల్ కతా సీబీఐ ఆఫీస్‌లో చేస్తున్నారు.