King Cobra Nest : ప్రపంచంలోనే అత్యంత పొడవైన విషసర్పంగా కింగ్ కోబ్రా (King Cobra) కు పేరుంది. దీన్ని మన తెలుగు రాష్ట్రాల్లో రాచనాగు (Racha Nagu), గిరి నాగు (Giri Nagu) అని పిలుస్తుంటారు. దీనికి మరో అరుదైన ప్రత్యేకత కూడా ఉంది. సాధారణంగా పాములు గుడ్లు పెట్టిన తర్వాత వాటిని వదిలేసి వెళ్లిపోతాయి. కానీ కింగ్ కోబ్రా మాత్రం తన గుడ్ల కోసం ప్రత్యేకంగా గూడు నిర్మిస్తుంది. వాటి నుంచి పిల్లలు బయటికి వచ్చే వరకు పొదుగుతుంది. ఈ అరుదైన మాతృత్వ లక్షణమే దాన్ని ఇతర పాములన్నింటి కంటే ప్రత్యేకంగా నిలబెడుతుంది.
ఆడ కింగ్ కోబ్రా ఎండిన ఆకులు, చిన్న కొమ్మలు, మొక్కల అవశేషాలను తన శరీరంతో ఒకచోటకు చేర్చి గూడు నిర్మిస్తుంది. సాధారణంగా చెట్ల అడుగున లేదా దట్టమైన పొదలు ఉన్న ప్రాంతాలను ఎంచుకుంటుంది. గూడు మధ్యలో గుడ్లు పెట్టేందుకు ప్రత్యేక గది మాదిరిగా స్థలం తయారు చేస్తుంది. ఒకేసారి 20 నుంచి 40 వరకు గుడ్లు పెడుతుంది. కొన్ని సందర్భాల్లో అంతకంటే ఎక్కువ గుడ్లు కూడా కనిపిస్తాయి. చాలా పాములు గుడ్లు పెట్టిన వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోతాయి. కానీ కింగ్ కోబ్రా మాత్రం గూడు పక్కనే ఉండి గుడ్లను కాపాడుతుంది.
గూడు కోసం వాడిన ఆకులు కుళ్లే క్రమంలో వేడి ఉత్పత్తి కావడంవల్ల గుడ్లు సహజంగానే వెచ్చగా ఉంటాయి. కొన్ని గూళ్లు 55 సెంటీమీటర్ల ఎత్తు, 1.4 మీటర్ల వెడల్పు వరకు ఉంటాయని వన్యప్రాణి నిపుణులు చెబుతున్నారు. పక్షులు, క్షీరదాలు, కీటకాలు గూళ్లు నిర్మించడం సహజమే. అయితే పాముల్లో ఈ లక్షణం దాదాపు కనిపించదు. కొన్ని సరీసృపాలు గుడ్లను ఇసుకలో లేదా మట్టిలో దాచిపెడతాయి. కానీ కింగ్ కోబ్రా మాత్రం రక్షణ కల్పించేలా గూడు నిర్మించి, పిల్లలు బయటకు వచ్చే వరకు అక్కడే ఉంటుంది. ఈ రెండు లక్షణాలు దానిని అత్యంత బాధ్యతగల తల్లిగా నిలబెడుతున్నాయి.
భారత్‌తోపాటు ఆగ్నేయాసియా అడవుల్లో కింగ్ కోబ్రాలు కనిపిస్తాయి. ప్రపంచంలోనే అత్యంత విషపూరిత పాముల్లో కింగ్ కోబ్రా కోటి. ఇవి సాధారణంగా మనుషులకు దూరంగా ఉంటాయి. వాటి విషం ఎంత భయంకరమో, వాటి మాతృత్వం అంతే ఆశ్చర్యకరమని వన్యప్రాణి పరిశోధకులు అంటున్నారు.