Khap Panchayat : దేశంలో స్వలింగ వివాహాలు, సహజీవనం లాంటి అనాచారాలపై నిషేధం విధించాలని ఐదు రాష్ట్రాలకు చెందిన పెద్ద మనుషులతో కూడిన ఖాప్ పంచాయతీ డిమాండ్ చేసింది. హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 300 మంది పెద్ద మనుషులు హర్యానాలోని జింద్‌లో సమావేశమై ఈ మేరకు తీర్మానం చేశారు. కేంద్ర సర్కారు తమ డిమాండ్లను నెరవేర్చకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగుతామని పంచాయతీ పెద్దలు హెచ్చరించారు.
సహజీవనం, స్వలింగ వివాహాల వంటివి సంప్రదాయాలు, సామాజిక విలువలను నాశనం చేస్తున్నాయని ఖాప్ పంచాయతీ పెద్దలు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ప్రేమ వివాహాలపై మాత్రం తమకు అభ్యంతరం లేదని చెప్పారు. పెద్దలను ఒప్పించి ప్రేమ వివాహాలు చేసుకోవడాన్ని తాము అంగీకరిస్తామని తెలిపారు. స్వలింగ సంభోగాన్ని జంతువులు కూడా ఇష్టపడవని, అలాంటిది మనుషుల్లో స్వలింగ వివాహాలు దారుణమని మండిపడ్డారు.
స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించడంవల్ల కుటుంబాలకు కుటుంబాలే చిన్నాభిన్నమవుతున్నాయని ఖాప్ పంచాయతీ పెద్దలు తెలిపారు. సహజీవనం కూడా సంసారాలను పాడు చేస్తోందని పేర్కొన్నారు. ముఖ్యంగా సహజీవనం వల్ల మహిళల పరిస్థితి దారుణంగా మారిందని.. కొన్ని కుటుంబాల్లో తల్లిదండ్రులు, భర్తలు, సోదరులే మహిళలను పరాయి వ్యక్తులతో శృంగారం చేయాలని ఒత్తిడి చేస్తున్నారని వాపోయారు.
అదేవిధంగా ఒకే గోత్రానికి చెందని వ్యక్తుల మధ్య వివాహాలు కూడా మంచివి కావని ఖాప్ పంచాయతీలో పెద్ద మనుషులు అభిప్రాయపడ్డారు. ఒక గోత్రానికి చెందిన వ్యక్తుల మధ్య వివాహాలు జరిగితే పిల్లలు అంగవైకల్యంతో జన్మించే ప్రమాదం ఉన్నదని పేర్కొన్నారు. సహజీవనం, స్వలింగ వివాహాలపై నిషేధం విధించాలని.. ఈ మేరకు చట్టసవరణ చేయాలని కోరుతూ తాము ప్రధాని నరేంద్రమోదీని, ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీని కలుస్తామని, అయినా తమ డిమాండ్లు నెరవేరకపోతే భారీ ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతామని హెచ్చరించారు.