న్యూఢిల్లీ, జూన్ 12: ఇటలీలో మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన కొద్ది గంటలకే ఖలిస్థానీ తీవ్రవాదులు బుధవారం ధ్వంసం చేశారు. హత్యకు గురైన ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్సింగ్ నిజ్జర్‌కు సంబంధించిన వివాదాస్పద నినాదాలను విగ్రహం దిమ్మెపై రాశారు.
ఇటలీలో ఈ నెల 13 నుంచి 15 వరకు జరిగే జీ-7 దేశాల సదస్సుకు ప్రధాని మోదీ హాజరు కానున్నారు. సదస్సు ప్రారంభం కావడానికి ఒక్కరోజు ముందు ఈ ఘటన జరగడం కలకలం సృష్టించింది. ఈ ఘటనను ఇటలీ అధికారుల దృష్టికి తీసుకెళ్లామని, వారు తగిన చర్యలు చేపడతామని చెప్పారని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి క్వాత్రా వెల్లడించారు.