హైదరాబాద్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ యువతను కంబోడియాకు పంపి, సైబర్ నేరస్తులకు అప్పగిస్తున్న కేసులో ఉత్తరప్రదేశ్‌కు చెందిన కీలక ఏజెంట్ సదాకత్ ఖాన్‌ను రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో (సీఎస్బీ) అధికారులు అరెస్టు చేశారు. మాల్దీవుల నుంచి తిరిగొస్తున్న ఆయనను ఈ నెల 2న ఢిల్లీ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నట్టు సీఎస్డీ డీజీ శిఖాగోయెల్ శుక్రవారం ప్రకటించారు. ఇప్పటికే ఈ కేసులో జగిత్యాలకు చెందిన కే సాయి ప్రసాద్‌తోపాటు మహ్మద్ అబిద్ హుస్సేన్ అన్సారీ (పుణె), మహ్మద్ షాదాబ్ ఆలం (బీహార్) అరెస్టయ్యారు.
వీరంతా తెలుగు రాష్ర్టాలకు చెందిన ఎంతో మంది యువతను ఉద్యోగాల పేరుతో కంబోడియాకు పంపి, సైబర్ నేరాలు చేయిస్తున్నారు. ఇటీవల సిరిసిల్లకు చెందిన ఓ యువకుడు చాకచక్యంగా తప్పించుకోవడంతో అక్కడ జరుగుతున్న దారుణాలు వెలుగులోకి వచ్చాయి. ఆ యువకుని తల్లి ఫిర్యాదు మేరకు సీఎస్బీ అధికారులు ఈ నెట్‌వర్క్‌లో భాగస్వాములైన కొందరు ఏజెంట్లను అరెస్టు చేశారు.
ఆ ఏజెంట్లు దాదాపు 600 మంది యువతను సైబర్ నేరాల్లోకి దింపి కోట్ల రూపాయలు కొల్లగొట్టినట్టు తేలింది. సదాకత్ ఖాన్ అరెస్టులో కీలకంగా వ్యవహరించిన ఎస్పీ దేవెందర్సింగ్, ఏసీపీ కేవీఎం ప్రసాద్, ఇన్స్పెక్టర్ భద్రంరాజు రమేశ్, జీ రాజు, ఎస్సై శ్రీరాములు నాయక్, కానిస్టేబుల్ శ్రీకాంత్‌ను ఆమె అభినందించారు. విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా చెప్తే వెంటనే సీఎస్బీ ద్వారా వెరిఫై చేయించుకోవాలని శిఖాగోయెల్ సూచించారు.