కోజికోడ్ (కేరళ), ఫిబ్రవరి 4: దేశంలో తొలిసారిగా ట్రాన్స్జెండర్ జంట తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ విషయాన్ని వృత్తిపరంగా డ్యాన్సర్ అయిన జియా పావల్ ఇన్స్టాలో వెల్లడిస్తూ తన భాగస్వామి అయిన జహాద్ గర్భంతో ఉందంటూ ప్రకటించింది. తల్లి కావాలనే తన కోరిక, తండ్రి అవ్వాలనే జహాద్ కోరిక ఈ ఏడాది మార్చి నాటికి నెరవేరనుందని, ఇలా ట్రాన్స్జెండర్ దంపతులు తల్లిదండ్రులు కావడం దేశంలోనే మొదటిసారని తమకు తెలిసిందంటూ పావల్ పేర్కొంది. పావల్, జహాద్ గత మూడేండ్లుగా సహజీవనం చేస్తున్నారు. అయితే ఇద్దరూ తమ జెండర్ల మార్పు కోసం హార్మోన్ థెరపీ చికిత్స తీసుకుంటున్నారు. అయితే సంతానం కోసం.. అబ్బాయిగా మారే చికిత్సను జహాద్ వాయిదా వేసుకున్నారు. దీనిపై జహాద్ మాట్లాడుతూ తాను గర్భం దాలుస్తానని కలలో కూడా ఊహించలేదని, ఊహించి ఉంటే బ్రెస్ట్ తొలగింపు సర్జరీ చేయించుకుని ఉండేదానిని కాదని తెలిపింది. తమలాగే చాలామంది ట్రాన్స్జెండర్లు తల్లిదండ్రులు కావాలని ఆశిస్తున్నా సమాజానికి భయపడి ముందుకు రావడం లేదని పావల్ తెలిపింది. తొలుత తామొక బిడ్డను దత్తత తీసుకోవాలని భావించినా అది చాలా కష్టమని గ్రహించామన్నారు. తొలిసారిగా తల్లిదండ్రులు అవుతుండటంపై పలు విమర్శలు వస్తున్నా తాము సానుకూల అంశాల గురించే పట్టించుకుంటున్నామన్నారు.