తిరువనంతపురం: ఆలయాల్లో ఉత్సవాలు జరిగినప్పుడు ఏనుగులపై దేవదేవులను ఊరేగించడం సాంప్రదాయం. కొన్ని చోట్ల ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏవి జరిగినా ఏనుగులను ఊరేగించడం ఆనవాయితీ. కేరళ (Kerala), తమిళనాడులోని (Tamilnadu) పలు ఆలయాల్లో భక్తులు గజరాజుల ఆశీర్వాదాలు పొందుతుంటారు. పలు క్షేత్రాల్లో ప్రత్యేకంగా ఏనుగులను (Elephant) పెంచుతూ ఉంటారు. అయితే అవి ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాయో ఎవరికీ తెలియదు. అంబారి కట్టినతర్వాత ఒక్కసారిగా ఘీంకారాలు పెడుతూ భక్తులపైకి వెళ్తూఉంటాయి. పరిసరాలను ధ్వంసం చేసిన ఘటనలు కోకొళ్లలు. కొన్నిసార్లయితే శిక్షణ ఇచ్చిన మావటీలను చంపిన ఘటనలు చూస్తుంటాం. ఇలాంటివేవీ తమ ఆలయంలో జరగకూడదని అనుకున్నారో ఏమో.. ఓ రోబోటిక్ ఏనుగును (Robotic elephant) ఉత్సవాల్లో వినయోగిస్తున్నారు. అది తల, తోక, చెవులను ఊపడంతోపాటు భక్తులకు ఆశీర్వాదాలు కూడా అందిస్తున్నది.
కేరళలోని (Kerala) త్రిసూర్‌లో (Thrissur) ఉన్న ఇరింజలకుడ శ్రీకృష్ణ ఆలయంలో (Irinjadappilly Sri Krishna Temple) జరిగిన నదయిరుతాల్ (Nadayiruthal) వేడుకలో రోబోటిక్ ఏనుగును వినియోగిస్తున్నారు. అంబారీ కట్టి భగవంతుని సేవలో పాల్గొన్నది. దీనిని సినీనటుడు పార్వతీ తిరువోతు సహాయంతో పెటా ఇండియా (PETA India) సభ్యులు ఆలయానికి అందజేశారు. నదయిరుతాల్ వేడుకల్లో ఏనుగులను సమర్పించడం సంప్రదాయంగా వస్తున్నది. ఇలా ఒక ఆలయంలో రోబో ఏనుగును ఉపయోగించడం ఇదే మొదటిసారి.
ఇది మర ఏనుగే అయినప్పటికీ నిజమైనదానిలానే ఉంటుందని ఆలయ అర్చకుడు రాజ్‌కుమార్ నంబూద్రి అన్నారు. ఏనుగు 11 అడుగుల ఎత్తు, 800 కిలోల బరువు ఉంటుందని చెప్పారు. ఐరన్ ఫ్రేమ్స్, రబ్బర్ కోటింగ్‌తో దీన్ని తయారుచేశారని తెలిపారు. నిజం ఏనుగులాగే తొండం ఊపుతుందని, చెవులను కదుల్చుతుందన్నారు. మావటి ఓ బటన్ నొక్కితే తొండంతో నీళ్లు విరజిమ్ముతుందని తెలిపారు. ఇలాంటి పనులు చేసేందుకు ఈ ఏనుగు లోపల కొన్ని ఎలక్ట్రిక్ మోటార్లు అమర్చారని చెప్పారు. ఇనుప చట్రానికి రబ్బరు తొడుగు వేసి ఈ ఏనుగును రూపొందించారని తెలిపారు. దీనికి ఇరింజదపల్లి రామన్ (Irinjadapilly Raman) అని నామకరణం చేశామని వెల్లడించారు.
కాగా, సాధారణణంగా ఏనుగులను పోషించడం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అని, వాటితో కొన్నిరకాల ఇబ్బందులు కూడా ఉన్నాయని ఆలయ అధికారులు అన్నారు. ఏనుగులను హింసించడాన్ని నిరోధించే క్రమంలో, ఈ రోబో ఏనుగు ఒక వినూత్న ముందడుగుగా భావిస్తున్నామని తెలిపారు. గత 15 ఏండ్లలో ఏనుగుల వల్ల 526 మంది మరణించాలని హెరిటేజ్ యానిమల్ టాస్క్‌ఫోర్స్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.