తిరువనంతపురం: కేరళను కొత్త వైరస్లు వెంటాడుతున్నాయి. తాజాగా నోరో వైరస్ కేసులు వెలుగు చూశాయి. తిరువనంతపురం, విజింజంలో స్కూలుకు వెళ్లే ఇద్దరు పిల్లలకు నోరో వైరస్ సోకింది. దీంతో ఆ రాష్ట్ర వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. నోరో వైరస్ కేసులపై సమగ్ర సమాచారాన్ని కోరారు. 2021 జూన్లో కేరళలోని అలప్పుజ జిల్లాలో తొలి నోరో వైరస్ కేసు వెలుగు చూసింది. డయెరియాకు సంబంధించిన ఈ వైరస్ కేసులు గత ఏడాది 950 నమోదయ్యాయి. ఈ వైరస్ వ్యాప్తి నెలన్నర పాటు కొనసాగింది. వందల సంఖ్యలో పిల్లలు దీని బారిన పడ్డారు.
కాగా, కలుషిత నీటి వల్ల నోరో వైరస్ వ్యాప్తిస్తుందని వైద్య నిఫుణులు తెలిపారు. దీని వల్ల ఉదర సంబంధ సమస్యలు, విరోచనాలు, వాంతులు వంటి లక్షణాలు ఉంటాయని చెప్పారు. 92 శాతం కేసులు అవుట్ పేషంట్లేనని, స్వీయ జాగ్రత్తలతో ఈ రోగం నుంచి బయటపడవచ్చని వివరించారు. పౌష్టికాహార లోపం ఉన్న వారిలో దీర్ఘ కాలంపాటు లక్షణాలు ఉంటాయని వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏటా సుమారు 68.5 కోట్ల మంది ఈ వ్యాధి బారిన పడుతుంటారని, ఐదేళ్లలోపు పిల్లల కేసులు సుమారు 20 కోట్లని గణాంకాల ద్వారా తెలుస్తుందన్నారు.