తిరువనంతపురం : దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి కొనసాగుతున్నది. దక్షిణాఫ్రికాలో నవంబర్ నెలాఖరులో గుర్తించిన వేరియంట్ ప్రపంచదేశాలను ఆందోళనకు గురి చేస్తున్నది. ఇప్పటి వరకు భారత్‌లో ఏడు రాష్ట్రాల్లో కేసులు గుర్తించగా.. తాజాగా ఆదివారం కేరళలోనూ తొలి కేసు నమోదైంది. బ్రిటన్ నుంచి తిరిగి వచ్చిన ఓ వ్యక్తి ఒమిక్రాన్ పాజిటివ్‌గా తేలిందని కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణాజార్జ్ తెలిపారు.
యూకే నుంచి అబుదాబి మీదుగా ఈ నెల 6న కొచ్చికి వచ్చినట్లు తెలిపారు. ఆ తర్వాత రెండు రోజులకు కొవిడ్ పాజిటివ్‌గా పరీక్షించినట్లు చెప్పారు. అలాగే అతని భార్య, తల్లికి సైతం కరోనా పాజిటివ్‌గా తేలిందని చెప్పారు. ప్రస్తుతం బాధితుడి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని ఆరోగ్యమంత్రి పేర్కొన్నారు. అయితే, సదరు వ్యక్తి వచ్చిన విమానంలో 149 మంది ప్రయాణికులు ఉన్నారని, వారిని అప్రమత్తం చేసే పనిలో ఉన్నారు. ప్రస్తుతం కరోనా కట్టడిలో కేరళ అధికార యంత్రాంగం చర్యలు చేపడుతున్నది.
ఈ క్రమంలో ఒమిక్రాన్ వేరియంట్ పాజిటివ్ కేసు రికార్డవడం ఆందోళన వ్యక్తమవుతున్నది. ఇదిలా ఉండగా ఆదివారం కేరళలో 57,121 పరీక్షలు చేయగా.. 3,777 కొత్త కొవిడ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 38,361 యాక్టివ్ కేసులున్నాయి. మరో వైపు ఇవాళ ఒకే రోజు భారత్‌లో ఐదు ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదవగా.. మొత్తం సంఖ్య 38కి పెరగ్గా.. మహమ్మారి ఎనిమిది రాష్ట్రాలకు విస్తరించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్, పంజాబ్, కర్ణాటక, గుజరాత్, కేరళ, ఢిల్లీ, మహారాష్ట్ర, రాజస్థాన్ ఉన్నాయి.