పాతానమిట్ట: శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో అపశృతి జరిగింది. పతినెట్టంపడి బంగారు మెట్లపై.. స్థానికంగా విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు ఫోటోషూట్(Sabarimala Photoshoot) చేశారు. 18 మెట్లపై ఫోటో దిగడం పట్ల వివాదం చెలరేగుతోంది. సోషల్ మీడియాలో ఆ ఫోటోపై విమర్శలు వస్తున్నాయి. పవిత్రమైన మెట్లపై పోలీసులు అంతా గ్రూపు ఫోటో దిగారు. దీనిపై ఏడీజీపీ శ్రీజిత్.. శబరిమల ఆఫీసర్ నుంచి ప్రత్యేక నివేదికను కోరారు. ఆ రోజుకు సంబంధించిన డ్యూటీ ముగించి వెళ్తున్న సమయంలో.. తొలి బ్యాచ్ సిబ్బంది మెట్లపై గ్రూపు ఫోటో దిగారు. పోలీసుల చర్యలను విశ్వ హిందూ పరిషత్ విమర్శించింది. పోలీసులు ప్రవర్తన అమర్యాదపూర్వకంగా ఉన్నట్లు పేర్కొన్నది. అయ్యప్ప విగ్రహం వైపు ఏ భక్తుడు కూడా తన వెన్ను చూపడరని ఆరోపించింది. ఆలయ ప్రధాన పూజారి కూడా విగ్రహాన్ని చూస్తూనే ఆ మెట్లు దిగుతారని వీహెచ్పీ తెలిపింది.