Kerala | కన్నూర్, జూన్ 10 : ఓ కేరళీయుడు చిన్నప్పుడెప్పుడో నాలుగో క్లాస్‌లో జరిగిన గొడవపై పగ పెంచుకొని 54 ఏండ్ల తర్వాత తన సహధ్యాయిపై దాడి చేశాడు. పోలీసులు అతడితోపాటు మరో నిందితుడిని అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. బాలకృష్ణన్, వీజే బాబు నాలుగో తరగతిలో క్లాస్మేట్స్. ఆనాడు బాబు తనపై దాడి చేశాడనేది బాలకృష్ణన్ వాదన.
ఈ విషయమై కొన్ని రోజుల క్రితం పూర్వ విద్యార్థుల సమావేశంలో ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. అయితే చివరికి అది పరిష్కారమైనా.. బాలకృష్ణన్, మాథ్యూ మళ్లీ ఈ నెల 2న బాబును కలిసి అప్పట్లో బాలకృష్ణన్‌ను ఎందుకు కొట్టావని మళ్లీ గొడవ పెట్టుకొని బాబుపై దాడి చేశారు. బాధితుడు ప్రస్తుతం కన్నూర్ ప్రభుత్వ వైద్య కళాశాల దవాఖానలో చికిత్స పొందుతున్నాడు.