న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: డబ్బు, ఇంటి సరిహద్దులపై వివాదం..పక్కపక్కనే ఇండ్లు ఉన్న కుటుంబాల మధ్య గొడవకు కారణమవుతుంటాయి. అయితే, కేరళలోని పాళ్లిక్కల్ గ్రామంలో ఓ కోడి కూత రెండు ఇండ్ల మధ్య వివాదానికి దారితీసింది. తెల్లవారుజామున 3 గంటలకు పక్కింట్లో నుంచి వచ్చే కోడి కూత..తన నిద్రకు భంగం కలిగిస్తున్నదని ఓ కేరళవాసి ఓ కోడిపై ఫిర్యాదు చేశాడు.
పొద్దున్నే పదే పదే వినిపించే కోడి కూత వల్ల రాత్రిపూట నిద్ర సరిగా ఉండటం లేదని, తన ప్రశాంతత దెబ్బతింటున్నదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీనికి కారణమైన పక్కింటి యజమాని అనిల్ కుమార్ కోడిపై ‘ఆదూర్ రెవెన్యూ డివిజన్’ (ఆర్డీవో) కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. ఆయన ఫిర్యాదును ఆర్డీవో అధికారులు సీరియస్గా తీసుకోవటమేగాక, క్షేత్రస్థాయికి వెళ్లి దర్యాప్తు సైతం చేశారు. కోడి, దాని కోడి పిల్లల గూడును ఇంట్లోనే మరొక చోటకు మార్చాలని అధికారులు సూచించారు.