మలపురం: పులి సంచారానికి చెందిన ఓ పాత వీడియో(Tiger Video)ను సోషల్ మీడియాలో షేర్ చేసి, ఆ పులి ఇప్పుడే కనిపించినట్లుగా స్థానికుల్ని భయభ్రాంతులకు గురిచేసిన ఓ వ్యక్తిని కేరళ పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తర కేరళ జిల్లాలోని ఓ గ్రామంలో ఉన్న ఎస్టేట్‌లో పులి తిరుగుతున్నట్లు నిందితుడు జీరిన్ అబ్రహం తన వాట్సాప్ స్టేటస్‌లో వీడియోను పోస్టు చేశాడు. కొత్తగా ఆ పులి కనిపించినట్లు అతను తన పోస్టులో పేర్కొన్నాడు. ఈ కేసులో కరువరకుండు పోలీసులు అతన్ని కస్టడీలోకి తీసుకున్నారు. అటవీశాఖ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అతన్ని పట్టుకున్నారు.
కరువరుకుండు సమీపంలో ఉన్న ఓ తేయాకు ఎస్టేట్‌లో పులి సంచరిస్తున్నట్లు వాట్సాప్ స్టేటస్‌లో జీరిన్ అబ్రహం వీడియోను పోస్టు చేశారు. అయితే వన్యప్రాణ జీవులకు కరువరుకుండు కేంద్రం కావడం వల్ల అక్కడ కొంత అలజడి చోటుచేసుకున్నది. కొన్ని న్యూస్ ఛానళ్లు ఆ వీడియోను ప్రసారం చేశాయి. దీంతో జనం భయాందోళనకు గురయ్యారు. ఈ విషయాన్ని తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు .. పులి సంచారం గురించి ఆరా తీశారు. అక్కడ కొత్తగా పులి ఏమీ సంచరించలేదని, అది పాత వీడియో అని గ్రహించారు.
అయితే సదురు వ్యక్తి మూడేళ్ల క్రితం నాటి వీడియోను ఎడిటింగ్ చేసి తన వాట్సాప్ స్టేటస్‌లో పెట్టుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. రాత్రి 11 గంటల సమయంలో తన స్నేహితుడితో కలిసి వాహనంలో వెళ్తున్నప్పుడు పులి కనిపించినట్లు అతను పోలీసులకు చెప్పాడు. సీసీటీవీ ఫూటేజ్‌లో కానీ, టైగర్ అడుగు ముద్రలు ఉన్నట్లు కానీ అటవీశాఖ అధికారులు గుర్తించలేదు. దీంతో అబ్రహంను అరెస్టు చేసి విచారణ చేపట్టడంతో.. అతను పాత వీడియో ఎడిటింగ్ గురించి చెప్పాడు.
ప్రజలను భయాందోళనలకు గురి చేయడం, ఎమర్జెన్సీ సర్వీసులో ఉన్న అధికారుల్ని తప్పుదోవ పట్టించారన్న కేసులో నిందితుడిపై ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. అతన్ని కోర్టు ముందు ప్రవేశపెట్టనున్నారు.