తిరువనంతపురం: కేరళను ‘బ్రెయిన్ ఈటింగ్ అమీబా’ వణికిస్తున్నది. ఈ వ్యాధి బారిన పడి 9 నెలల్లో 19 మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటివరకు 61 కేసులు నమోదయ్యాయి. దీనిని ప్రైమరీ అమీబిక్ మెనింగోఎన్సెఫలటిస్ (పీఏఎం) అని పిలుస్తారు. ఇది అత్యంత అరుదైన మెదడుకు సోకే వ్యాధి. లక్షణాలు ప్రారంభమైన తర్వాత వేగంగా ఈ వ్యాధి వృద్ధి చెందుతున్నది. కేరళ ఆరోగ్య మంత్రి వీణ జార్జి మాట్లాడుతూ, మొదట్లో ఈ వ్యాధి కొజిక్కోడ్, మలప్పురంలలో మాత్రమే కనిపించేదని, ఇప్పుడు పలు ప్రాంతాల్లో నమోదవుతున్నాయని తెలిపారు.
గాజాలో 65 వేలు దాటిన మరణాలు
జెరూసలేం, సెప్టెంబర్ 17: గత రెండేండ్లుగా ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో గాజాలో 65,062 మంది మరణించగా, 1,66,697 మంది గాయపడ్డారని గాజా ఆరోగ్య శాఖ బుధవారం వెల్లడించింది. మృతుల్లో సగం మంది మహిళలు, పిల్లలు ఉన్నారని తెలిపింది. 2023 అక్టోబర్ 7 నుంచి ఇజ్రాయెల్ జరుపుతున్న దాడుల్లో గాజాలోని చాలా ప్రాంతాలు ధ్వంసం అయ్యాయని చెప్పింది. ఒక వినాశకరమైన సంక్షోభం కారణంగా 90 శాతం మంది నిర్వాసితులుగా మారారని తెలిపింది. అయితే మృతుల్లో పౌరులు ఎంతమంది, మిలిటెంట్లు ఎంతమంది అన్న విషయాన్ని గాజా ఆరోగ్య శాఖ వెల్లడించ లేదు.