Revenge | స్నేహితుల మధ్య గొడవలు సహజమే. మరీ ముఖ్యంగా చిన్నతనంలో ఎప్పుడో ఒకప్పుడు ఏదో విషయంలో దెబ్బలాడుకునే ఉంటారు. ఆ తర్వాత, మళ్లీ అన్నీ మరచిపోయే ఎప్పటిలాగే కలిసి ఉంటారు. పెరిగి పెద్దయ్యాక స్నేహితులు ఎక్కడైనా తారసపడిన సందర్భంలో అప్యాయంగా పలకరించుకుంటారు. కానీ, కాసర్గోడ్లో చోటుచేసుకున్న ఓ విచిత్ర ఘటన అందుకు పూర్తి భిన్నంగా నిలిచింది. ఏకంగా 50 ఏళ్ల కిందట జరిగిన చిన్నపాటి గొడవను మరిచిపోని ఓ వ్యక్తి, తన పాత స్నేహితుడిపై దాడికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. కాసర్గోడ్ జిల్లాకు చెందిన బాలకృష్ణన్, వీజే బాబు అనే వ్యక్తులు నాలుగో తరగతిలో ఒకే పాఠశాలలో చదువుకున్నారు. అప్పుడు ఇద్దరి మధ్య జరిగిన చిన్న గొడవలో బాలకృష్ణన్‌ను వీజే బాబు కొట్టాడు. ఆ తర్వాత ఇద్దరూ వేర్వేరు ప్రాంతాలకు వెళ్లిపోయారు.
అయితే ఈ ఘటనను బాలకృష్ణన్ మనసులో దాచుకుని.. బాబుపై పగను పెంచుకున్నాడు. దాదాపు 50 సంవత్సరాల తర్వాత.. బాలకృష్ణన్ తన మిత్రుడు మాథ్యూతో కలిసి ఇటీవల వెళ్తున్న సమయంలో వారికి వీజే బాబు కనిపించాడు. వెంటనే బాలకృష్ణ ‘నాలుగో తరగతిలో నన్నెందుకు కొట్టావు?’ అంటూ అంటూ అతన్ని పట్టుకొని నిలదీశాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య మాటలు పెరిగాయి. బాలకృష్ణన్ తన స్నేహితుడు మాథ్యూతో కలిసి వీజే బాబుపై దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన వీజే బాబు ప్రస్తుతం కన్నూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే, 50 ఏళ్ల క్రితం జరిగిన ఘటనే కారణమని తెలిసి పోలీసులు సైతం విస్మయానికి గురయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఘటన ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.