తిరువనంతపురం, నవంబర్ 1: తమ రాష్ట్రం కటిక పేదరికం నుంచి విముక్తి పొందినట్లు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ శనివారం అసెంబ్లీలో ప్రకటించారు. కేరళ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో విజయన్ ఈ ప్రకటన చేశారు. కాగా, విజయన్ ప్రకటనను మోసపూరితంగా అభివర్ణించిన కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ ఇందుకు నిరసనగా ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని బహిష్కరించింది. రూల్ 300 ద్వారా ముఖ్యమంత్రి చేసిన ప్రకటనను పూర్తి మోసమని ఆరోపించిన ప్రతిపక్ష నేత సతీశన్ ఇది సభా నిబంధనలను ధిక్కరించడమేనని అన్నారు. ఈ కారణంగా తాము సభలో పాల్గొనలేమని, సమావేశాన్ని బహిష్కరిస్తున్నామని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి ప్రకటనను మోసపూరితం, సిగ్గుచేటు అని నినాదాలు చేస్తూ యూడీఎఫ్ సభ్యులు నభ నుంచి వాకౌట్ చేశారు.