తిరువనంతపురం: కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించినప్పటికీ ప్రధాని మోదీపై బీబీసీ డాక్యుమెంటరీని కేరళ కాంగ్రెస్ ప్రదర్శించింది. తిరువనంతపురంలోని షణ్ముగం బీచ్ వద్ద ఆదివారం పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేసి దీనిని ప్రదర్శించారు. 2002 గుజరాత్ అల్లర్లు, ప్రధాని మోదీ రాజకీయాల గురించి రెండు భాగాలుగా ఈ డాక్యుమెంటరీలో పేర్కొన్నారు. కాగా, కేరళలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. అక్కడ అధికారంలో ఉన్న సీపీఎం ప్రభుత్వం కూడా బీబీసీ డాక్యుమెంటరీని నిషేధించడాన్ని వ్యతిరేకించింది.
మరోవైపు ప్రధానిపై బీబీసీ డాక్యుమెంటరీ ఒక ప్రమాదకరమైన ఉదాహరణగా కేరళ కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోని కుమారుడు అనిల్ ఆంటోనీ పేర్కొన్నారు. కాంగ్రెస్ స్టాండ్‌ను వ్యతిరేకించిన ఆయన ట్వీట్‌పై పార్టీ నేతల నుంచి విమర్శలు రావడంతో ఏకంగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నిషేధించిన వివాదస్పద బీబీసీ డాక్యుమెంటరీని కేరళ కాంగ్రెస్ ఆదివారం ప్రదర్శించడం చర్చకు దారి తీసింది. ఇప్పటికే ఈ డాక్యుమెంటరీని పలు చోట్ల ప్రదర్శించడంతో బీజేపీ, ఆ పార్టీ అనుబంధ సంఘాలు నిరసనలు చేస్తున్నాయి.