న్యూఢిల్లీ : రెడీ టూ ఈట్ పరోటాలపై 18 శాతం జీఎస్టీకి గుజరాత్ అప్పీలేట్ అథారిటీ ఆఫ్ అడ్వాన్స్ రూలింగ్ (ఏఏఏఆర్) గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. పరోటాలను సాధారణ చపాతి, రోటీ క్యాటగిరీ కింద పరిగణించలేమని వివేక్ రంజన్, మిలింద్ తొరవనేలతో కూడిన ద్విసభ్య బెంచ్ వ్యాఖ్యానించింది.
పరోటాల్లో గోధుమ పిండిని వాడినా నేరుగా తినలేమని, మూడు నిమిషాలు వేడిచేయాల్సి ఉంటుందని బెంచ్ తెలిపింది. పరోటాలపై 18శాతం జీఎస్టీ విధించాలనే ఆర్డర్ సరైనదేనని తీర్పు చెప్పింది.జీఏఏఏఆర్ తీర్పును కేజ్రీవాల్ ప్రస్తావిస్తూ చివరికి బ్రిటిష్ వారు సైతం ఆహారోత్పత్తులపై పన్ను విధించలేదని అన్నారు.
ఇవాళ ద్రవ్యోల్బణానికి కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న అధిక జీఎస్టీయే కారణమని మండిపడ్డారు. జీఎస్టీ రేటును తగ్గిస్తేనే ధరల మంట నుంచి ప్రజలకు ఉపశమనం కలుగుతుందని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఆహారోత్పత్తులతో పాటు నిత్యావసరాలపై జీఎస్టీని తగ్గించాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు.