న్యూఢిల్లీ, అక్టోబర్ 7: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీబీఐ, ఈడీ దాడులపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు. నీచ రాజకీయాల కోసం అనేక మంది అధికారుల విలువైన సమయం వృథా చేస్తున్నారని పరోక్షంగా బీజేపీని ఉద్దేశించి అన్నారు.
‘ఇలా అయితే దేశం ఎలా పురోగతి సాధిస్తుంది?’ అని ప్రశ్నిస్తూ శుక్రవారం ట్వీట్ చేశారు. డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు వ్యతిరేకంగా ఆధారాలు గుర్తించేందుకు 300 మందికి పైగా సీబీఐ, ఈడీ అధికారులు రేయింబవళ్లు పనిచేస్తున్నారని, 500 చోట్ల సోదాలు చేపట్టారని.. తప్పు ఏం జరుగలేదు కాబట్టి వారికి ఏం దొరకలేదని అన్నారు. మరోవైపు ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ మనీలాండరింగ్ కేసులో ఈడీ మరోసారి సోదాలు చేపట్టింది. ఢిల్లీ, పంజాబ్, హైదరాబాద్లోని పలు ప్రాంతాలతో సహా దేశంలోని 35 ప్రాంతాల్లో అధికారులు శుక్రవారం సోదాలు చేశారు.