Kash Patel : అమెరికాకు చెందిన ‘ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI)’ డైరెక్టర్ కాష్ పటేల్ (Kash Patel) పై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఆయన ఆఫీసులో కంటే నైట్ క్లబ్బుల్లోనే ఎక్కువగా కనిపిస్తున్నారని, బ్యూరోలో వ్యవహారమంతా గందరగోళంగా ఉందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎఫ్‌బీఐలో కౌంటర్ ఇంటెలిజెన్స్‌కు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఫ్రాంక్ ఫిగ్లియుజ్జి (Frank Figliuzzi) కాష్ పటేల్‌పై ఆరోపణలు చేశారు.
ఫ్రాంక్ ఫిగ్లియుజ్జి ఓ షోలో మాట్లాడుతూ.. ‘హూవర్ భవనంలోని ఏడో అంతస్తులో కంటే ఇప్పుడు నైట్క్లబ్బుల్లోనే కాష్ పటేల్ ఎక్కువగా కనిపిస్తున్నాడని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. బ్రీఫింగ్‌లను రోజూవారీగా కాకుండా వారానికి రెండుసార్లకు మార్చారని ఆ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఆయన అనుభవం లేకుండా పనులు చేయాలని ప్రయత్నిస్తే అవి చెడుకు దారితీయవచ్చు. ఏజెంట్లు పనిచేయడానికి ఆయన అనుమతిస్తున్నారు. అది ఎక్కడికి వెళుతుందో తెలియదు’ అని అన్నారు.
కాగా వనరుల దుర్వినియోగం, ముఖ్యంగా ఏజెన్సీకి చెందిన ప్రైవేట్ జెట్లను ఉపయోగించడంపై ఆయనపై దర్యాప్తు నిర్వహించాలని డెమోక్రాట్ల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. కాష్ పటేల్ ఎఫ్‌బీఐ డైరెక్టర్ పదవి కోసం బలంగా లాబీయింగ్ చేసినట్లు గతంలో అంతర్జాతీయ మీడియా తెలిపింది. తన రాజకీయ శత్రువులపై కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టాలంటే పటేల్ సరైన వ్యక్తని భావించే ట్రంప్ అతడికి సీఐఏ డైరెక్టర్ పదవి కట్టబెట్టినట్లు తెలుస్తోంది.
2020లో కూడా ట్రంప్.. కాష్ పటేల్‌ను సీఐఏ డైరెక్టర్‌గా నియమించాలని చూసినా సాధ్యం కాలేదు. అప్పట్లో ట్రంప్ తన చివరి వారాల్లో ఎఫ్‌బీఐ డిప్యూటీ డైరెక్టర్‌గా కాష్ను నియమించాలని భావించారు. భారతీయ మూలాలున్న కాష్ (కశ్యప్) పటేల్ మొదటి నుంచి ట్రంప్‌నకు వీర విధేయుడు. ఆయన ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ అజెండాకు కాష్ పూర్తిగా మద్దతు పలికాడు.