Siddaramaiah | బెంగళూరు, అక్టోబర్ 6: కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు భంగపాటు ఎదురైంది. మహిళలను అడిగి మరీ ఆయన నిలదీతకు గురయ్యారు. ఐదు గ్యారంటీలు అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు.. ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో ఆపసోపాలు పడుతున్నది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉండటంతో పథకాల అమలులో ఆ రాష్ట్ర సర్కార్ ఇబ్బందులను ఎదుర్కొంటున్నది. ఎమ్మెల్యేలు, మంత్రులను ప్రజలు గ్యారంటీల గురించి నిలదీస్తున్నారు.
తాజాగా ఏకంగా సీఎం సిద్ధరామయ్యనే మహిళలు పథక లబ్ధి తమకు అందలేని కంగుతినిపించారు. రాష్ట్రంలోని ఓ జిల్లాలో నిర్వహించిన సభలో గృహలక్ష్మి పథకం లబ్ధి చేకూరుతున్నదా? అని సీఎం అడిగారు. అయితే ఆయన అడిగినప్పటికీ సభలో ఉన్న మహిళలేవరూ స్పందించలేదు. దీంతో సిద్ధరామయ్యే మళ్లీ కలగజేసుకొని మరోసారి అదే ప్రశ్నను అడిగారు.
దీంతో మహిళలంతా ఒక్కసారిగా మాకు రాలేదంటే.. మాకు రాలేదని ముక్తకంఠంతో అరిచారు. దీంతో సీఎం సిద్ధరామయ్య కంగుతిన్నారు. అంతలోనే తేరుకొని విషయాన్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం చేశారు. ఇప్పటికే చాలా మందికి పథకం అందుతున్నదని పేర్కొన్నారు. ఆధార్‌కార్డు లింక్ కాకపోవడం తదితర కారణాల వల్ల కొంతమందికి అందలేదని, వారికి కూడా త్వరలోనే అందిస్తామని చెప్పి చల్లగా జారుకున్నారు.