MUDA Scam : ముడా స్కామ్లో సీఎం సిద్ధరామయ్యపై కాషాయ నేతలు పసలేని ఆరోపణలు చేస్తున్నారని కర్నాటక మంత్రి దినేష్ గుండూరావు అన్నారు. సీఎంను టార్గెట్ చేసి తమ ప్రభుత్వాన్ని అస్ధిరపరచాలని బీజేపీ నేతలు కుట్రపన్నారని ఆరోపించారు. మంత్రి హుబ్బలిలో శుక్రవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ముడా స్కామ్లో సీఎం ఎలాంటి తప్పూ చేయలేదని అన్నారు. అధికార దుర్వినియోగం జరగలేదని చివరికి విపక్షానికీ తెలుసని చెప్పారు.
పార్టీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, నేతలంతా సిద్ధరామయ్య వెన్నంటి ఉన్నారని చెప్పారు. ఈ ఘటన అనంతరం పార్టీలో మునుపెన్నడూ లేని ఐక్యత నెలకొందని చెప్పారు. అవినీతి మన వ్యవస్ధలో వేళ్లూనుకుందని, ఎక్కడైనా అవినీతి జరిగితే దానిపై చర్యలు చేపట్టాలని, చట్ట ప్రకారం ముందుకెళ్లాల్సి ఉంటుందని దినేష్ గుండూరావు పేర్కొన్నారు. కాగా, ముడా స్కామ్లో కర్నాటక సీఎం సిద్ధరామయ్య విచారణకు రాష్ట్ర గవర్నర్ అనుమతించడంపై కర్నాటక మంత్రి హెచ్కే పాటిల్ స్పందించారు. బెంగళూర్లో ఆయన మీడియాతో మాట్లాడారు.
సీఎం సిద్ధరామయ్య విచారణకు సంబంధించి గవర్నర్ నిర్ణయం తప్పని, దీనిపై తాము న్యాయస్ధానాల్లో పోరాడుతున్నామని హెచ్కే పాటిల్ పేర్కొన్నారు. ఇక ముడా స్కామ్ కేసులో తనపై ప్రాసిక్యూషన్కు తక్షణమే ఆమోదం తెలిపిన గవర్నర్ వివక్ష ప్రదర్శించారని కర్నాటక సీఎం సిద్ధరామయ్య ఆరోపించారు. మైనింగ్ కేసులో కేంద్ర మంత్రి, మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి విచారణకు అనుమతించడంలో మాత్రం జాప్యం చేస్తున్నారని ఇది వివక్ష కాక మరేమిటని సీఎం ప్రశ్నించారు.
Read More :
Crocodile | పత్తి చేనులో మొసలి కలకలం.. భయంతో పరుగులు తీసిన కూలీలు : వీడియో