బెంగళూరు : కర్ణాటక ప్రజలపై మరో ధరల పిడుగు పడనుంది. అధికారం చేపట్టినప్పటి నుంచి ధరలు పెంచుతూ ప్రజలపై భారం మోపడమే ధ్యేయంగా పెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈసారి నందిని పాల ధరను పెంచాలని నిర్ణయించింది. లీటర్ పాలపై రూ.5 పెంచాలని కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ప్రతిపాదించింది. ప్రభుత్వం ఆమోదం తెలిపితే, రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టే మార్చి 7 తర్వాత నుంచి ఇది అమలులోకి రానుంది. పాల ప్యాకెట్ సైజ్ను 1050 ఎంఎల్ నుంచి లీటర్కు తగ్గించనున్నట్టు ఫెడరేషన్ ప్రకటించింది. కొత్త ధర అమలులోకి వస్తే టోన్డ్ మిల్క్ ప్రస్తుతమున్న రూ.44 నుంచి 47కు పెరుగుతుంది. గత మూడేండ్లలో కేఎంఎఫ్ ధరల పెంపులో ఇదే అత్యధికం. నందిని పాల ధరల పెంపు ప్రతిపాదనపై కర్ణాటక లెజిస్లేటివ్ కౌన్సిల్ విపక్ష నేత నారాయణ స్వామి తీవ్రంగా నిరసించారు.