బెంగళూరు: అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఒక ఐఏఎస్ అధికారి అదృశ్యమయ్యారు. చివరిసారిగా విమానాశ్రయంలో ఆయన ఆచూకీ లభించినట్లు సమాచారం. అయితే ఆ అధికారి కుటుంబ సభ్యులు లేదా ఇతరుల నుంచి దీనిపై ఫిర్యాదు అందలేదని ప్రభుత్వం పేర్కొంది. (IAS officer missing) కర్ణాటకకు చెందిన ఐఏఎస్ అధికారి జ్ఞానేంద్ర కుమార్ గంగ్వార్ అదృశ్యమయ్యారు. ఆగస్ట్ 20 నుంచి ఆయన ఎవరికీ అందుబాటులో లేరు. ఆ ఐఏఎస్ అధికారి చివరిసారిగా కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద కనిపించారని, విమానంలో ఢిల్లీకి వెళ్లినట్లు తెలుస్తున్నదని హోం మంత్రి ప్రియాంక్ ఖర్గే శనివారం తెలిపారు. అయితే జ్ఞానేంద్ర కుమార్ మిస్సింగ్‌పై ఆయన కుటుంబ సభ్యులు లేదా మరెవరి నుంచి ఎలాంటి అధికారిక ఫిర్యాదు అందలేదని చెప్పారు. ఆయన మిస్సింగ్‌పై దర్యాప్తు చేస్తున్నట్లు మీడియాతో అన్నారు.
కాగా, 2016 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి జ్ఞానేంద్ర కుమార్ గంగ్వార్ ప్రస్తుతం పరిశ్రమలు, వాణిజ్య శాఖలో ఎంఎస్ఎంఈ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ (కేపీఎస్సీ)లో పరీక్షల నియంత్రణాధికారిగా ఆయన పనిచేశారు. అవినీతి ఆరోపణలపై ఈ ఏడాది మార్చిలో ఆ పదవి నుంచి ఆయనను తప్పించారు.
అయితే పశువైద్యాధికారుల నియామక పరీక్షలో కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ దర్యాప్తులో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఆగస్ట్ 18న కేపీఎస్సీ సభ్యురాలు శాంత హోస్మణి, మరికొందరి నివాసాలు, కార్యాలయాలపై రైడ్ చేశారు. ఆ తర్వాత నుంచి ఐఏఎస్ అధికారి జ్ఞానేంద్ర కుమార్ గంగ్వార్ అదృశ్యం కావడంతో ఆయన కోసం వెతుకుతున్నారు.
మరోవైపు కేపీఎస్సీ చైర్పర్సన్ శివశంకరప్ప ఎస్. సాహుకర్ కూడా పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తప్పుడు ఆదాయ ధృవీకరణ పత్రం ఆధారంగా ఆయన కుమార్తె ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపిక కావడంపైనా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో కేపీఎస్సీ చైర్పర్సన్ శివశంకరప్ప ఎస్. సాహుకర్ను సస్పెండ్ చేయాలని, ఆయనపై విచారణ చేపట్టాలని గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్‌కు సిఫార్సు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం శుక్రవారం నిర్ణయించిందని హోం మంత్రి ప్రియాంక్ ఖర్గే తెలిపారు.