బెంగళూర్ : ఉర్దూ రానందునే 22 ఏండ్ల యువకుడి హత్య జరిగిందన్న వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో కర్నాటక హోంమంత్రి అరగ జ్జ్ఞానేంద్ర తన ప్రకటనను వెనక్కితీసుకున్నారు. రోడ్డు ప్రమాదంపై జరిగిన రగడ కారణంగానే ఈ హత్య జరిగిందని చెప్పుకొచ్చారు. మంత్రి ప్రకటనపై విపక్షాలు భగ్గుమనడంతో ఆయన వివరణ ఇచ్చుకున్నారు. చంద్రు హత్యపై తాను సమాచారం సేకరించానని, ఉర్దూలో మాట్లాడాలని కోరగా తనకు ఉర్దూ రాదని యువకుడు చెప్పగా దుండగులు అతడిపై కత్తిపోట్లతో విరుచుకుపడి కడతేర్చారని అంతకుముందు హోంమంత్రి జ్ఞానేంద్ర పేర్కొన్నారు.
దళిత యువకుడిని దారుణంగా హత్య చేసిన ఘటనకు సంబంధించి కొందరు నిందితులను అరెస్ట్ చేశారని చెప్పారు. కాగా ఈ ఘటన రోడ్డు ప్రమాదం కారణంగా ఏర్పడిన వివాదంతో జరిగిందని బెంగళూర్ పోలీస్ కమిషనర్ కమల్ పంత్ తెలిపారు. ఏప్రిల్ 4 అర్ధరాత్రి 2.30 గంటలకు చంద్రు, సిమన్ రాజ్ హొసగుడదహళ్లిలోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లగా అప్పటికి మూతపడటంతో వెనుతిరిగారని, వారు బైక్‌పై తిరిగి వస్తుండగా షాహిద్ అనే వ్యక్తి నడిపే మరో బైక్‌ను ఢీకొట్టారని చెప్పారు.
దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగిందని షాహిద్ అతడి స్నేహితులు ఇద్దరు చంద్రు తొడపై కత్తితో దాడి చేసి పరారయ్యారని తెలిపారు. గాయపడిన చంద్రును విక్టోరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటనలో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామని పంత్ వెల్లడించారు. ఇక హోంమంత్రి తన ప్రకటనను వెనక్కితీసుకుంటూ ఇది భాష కారణంగా జరిగిన హత్య కాదని తనకు తెలిసిందని వివరణ ఇచ్చారు. కాగా హోంమంత్రి స్ధానంలో ఉన్న వ్యక్తి తప్పుడు సమాచారం ఇవ్వడం సరైంది కాదని, ఆయన ఆ పదవికి అనర్హుడని విపక్ష నేత సిద్ధరామయ్య అన్నారు.