మైసూరు, సెప్టెంబర్ 3: ముడా కుంభకోణంలో తనపై విచారణకు గవర్నర్ అనుమతి ఇవ్వడం పట్ల కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. తానేమీ తప్పు చేయలేదని, తనకేమీ ఆందోళన లేదని పేర్కొన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘నాకు వ్యతిరేకంగా చెప్తున్న అబద్ధాలు నిజం కావడం లేదని ప్రతిపక్ష నేతలే ఆందోళనతో ఉన్నారు. నేను ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు. నేను ఎలాంటి తప్పు చేయలేదు. కాబట్టి నాకు ఎలాంటి ఆందోళన లేదు’ అని వ్యాఖ్యానించారు. కాగా, తనకు ముఖ్యమంత్రి కావాలని ఉందని పార్టీ నేత ఆర్వీ దేశ్పాండే చేసిన వ్యాఖ్యలపై సిద్ధరామయ్య స్పందిస్తూ.. సీఎంను చేయాల్సింది శాసనసభ్యులు, హైకమాండ్ అని, ముఖ్యమంత్రి ఎవరో వారే నిర్ణయిస్తారని పేర్కొన్నారు.
ముడా మాజీ కమిషనర్ సస్పెండ్
మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(ముడా) మాజీ కమిషనర్ జీటీ దినేశ్ కుమార్ను సస్పెండ్ చేస్తూ కర్ణాటక ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముడా కమిషనర్గా ఉన్నప్పుడు జీటీ దినేశ్ కుమార్ అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో సస్పెండ్ చేస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొన్నది. ముడానుంచి తప్పించుకోవడానికి కాంగ్రెస్ ప్రభు త్వందినేశ్ కుమార్ను బలిపశువును చేసిందని బీజేపీ నేత బీవై విజయేంద్ర ఆరోపించారు.