Rameshwaram Cafe Case | బెంగళూరు రామేశ్వరం కేఫ్ బాస్ట్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకున్నది. కేసులో ప్రధాన నిందితుడిని కలిసి వ్యక్తిని జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అదుపులోకి తీసుకున్నది. పేలుడు ఘటనపై వివిధ కోణాల్లో దర్యాప్తు చేసిన ఎన్ఐఏ.. బళ్లారి పేలుడు ఘటనలో ప్రధాన నిందితుడితో సంబంధం ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో కర్ణాటకలోని బళ్లారి జిల్లాకు చెందిన సయ్యద్ షబ్బీర్ అనే అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. రామేశ్వరం కేఫ్ పేలుడులో ప్రధాన నిందితుడు పారిపోయిన మార్గంలోని సీసీటీవీ ఫుటేజీలను విశ్లేషించినట్లు కర్ణాటక పోలీసు వర్గాలు తెలిపాయి.
అనుమానితుడు బళ్లారి వెళ్లేందుకు రెండు అంతర్రాష్ట్ర ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించినట్లు గుర్తించారు. అనుమానితుడు గుర్తు తెలియని ప్రాంతానికి వెళ్లాడని.. ప్రస్తుతం షబ్బీర్‌ను విచారిస్తున్నట్లు ఎన్ఐఏ వర్గాలు తె లిపాయి. అయితే, సీసీటీవీ ఫుటేజీలో కనిపించిన వ్యక్తి అతనేనా..? కాదా? అనేది నిర్ధారించాల్సి ఉంది. పేలుడు ఘటన ఎన్ఐఏ రంగంలోకి దిగి.. అనుమానితుడిని పట్టుకునేందుకు రూ.10లక్షల రివార్డు సైతం ప్రకటించింది. ఆచూకీ తెలిస్తే info.blr.nia@gov.in మెయిల్ ఐడీతో పాటు 080-29510900, 8904241100 నంబర్లలో సంప్రదించాలని కోరింది. పేలుడుకు సంబంధించి ఏదైనా చిన్న సమాచారం ఉన్నా తెలియజేయాలని ఎన్ఐఏ కోరింది. సమాచారం ఇచ్చిన వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపింది.
రామేశ్వరం కేఫ్ ఐఈడీ బ్లాస్ట్ కేసులో అనుమానితుడిని కలిసి షబ్బీర్‌ను అరెస్టు చేసినట్లు కర్ణాటక పోలీసులు తెలిపారు. షబ్బీర్‌ను సైతం ప్రధాన నిందితుడిగానే చూస్తున్నట్లు ఎన్ఐఏ వర్గాలు తెలిపాయి. బళ్లారిలో మార్చి 1న ప్రధాన నిందితుడిని కలిశాడు. షబ్బీర్ బళ్లారిలో నిందితుడితో మాట్లాడినట్లు తెలుస్తున్నది. నిందితుడు ఎవరు ? తప్పుదారి పట్టించేందుకు వేషధారణ మార్చాడా అనే కోణంలో విచారిస్తున్నట్లుగా సమాచారం. పేలుడు జరిగిన దాదాపు ఎనిమిది గంటల తర్వాత మార్చి 1న బళ్లారి బస్టాండ్‌లో అనుమానితుడు చివరిసారిగా కనిపించాడు.
పేలుడు ఘటనలో ఎన్ఐఏ ఇస్లామిక్ స్టేట్ (ISIS) మాడ్యూల్స్ నుంచి నలుగురిని అదుపులోకి తీసుకుంది. నిందితుడు కేఫ్ నుంచి మూడు కిలోమీటర్ల దూరం వెళ్లిన తర్వాత తన వేషధారణను మార్చుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అతడు ధరించిన బేస్ బాల్ క్యాప్, షర్ట్‌ను మార్చుకొని.. సాధారణ టీ షర్ట్ ధరించినట్లు గుర్తించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. పేలుడుతో మూతపడిన రామేశ్వరం కేఫ్ 9న మళ్లీ తెరుచుకున్నది. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరుగకుండా చర్యలు తీసుకుంటామని కేఫ్ సహ వ్యవస్థాపకుడు రాఘవేంద్రరావు తెలిపారు.