(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్ (నమస్తే తెలంగాణ): గోబీ మంచూరియా, కాటన్ క్యాండీ (పీచు మిఠాయి) విక్రయాలపై కర్ణాటక సర్కారు నిషేధం విధించింది. ఆకర్షణీయంగా కనిపించడానికి ఈ పదార్థాల్లో కృత్రిమ ఫుడ్ కలర్స్‌ను వాడుతుండటమే కారణంగా తెలిపింది.
రంగుల కోసం ఉపయోగించే రోడమైన్-బి అనే రసాయనం క్యాన్సర్ వంటి ప్రమాదకర రోగాలకు కారణమవుతున్నదని, అలాంటి విష పదార్థాన్ని గోబీ మంచూరియా, కాటన్ క్యాండీల్లో యథేచ్ఛగా వినియోగిస్తున్నారని కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి దినేశ్ గుండురావు సోమవారం మీడియా భేటీతో వెల్లడించారు.
‘ఆరోగ్యశాఖ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల పలు ఫుడ్ సెంటర్లు, 3-స్టార్ హోటల్స్ నుంచి 171 గోబీ మంచూరియా, 25 కాటన్ క్యాండీ నమూనాలను సేకరించారు. వాటిని పరీక్షించగా.. 106 మంచూరియా పదార్థాల్లో, 15 క్యాండీల్లో హానికర కృత్రిమ రంగులను ఉపయోగించినట్లు తేలింది. వాటిల్లో రోడమైన్-బి, టాట్రజైన్, కార్మోయిజిన్, సన్‌సెట్ యెల్లో వంటి రసాయనాలను వినియోగిస్తున్నారు. ఇవి ఆరోగ్యానికి హానికరం’ అని పేర్కొన్నారు.
జైలు శిక్ష, జరిమానా
రంగులు వినియోగించిన గోబీ మంచూరియా, కాటన్ క్యాండీలను నిబంధనలు ఉల్లంఘిస్తూ విక్రయాలు చేపట్టే వారికి ఏడేండ్ల జైలు శిక్షతో పాటు రూ. 10 లక్షల జరిమానా, లైసెన్సును రద్దు చేస్తామని మంత్రి తెలిపారు.