న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘సర్’ ప్రక్రియపై రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసమే ఎన్నికల సంఘం ‘సర్’ను చేపడుతున్నదని, భారీ సంఖ్యలో ఓట్లను తొలగిస్తున్నదని ఆరోపించారు. ‘ఓటర్ల జాబితాను తారుమారు చేయడానికి ‘సర్’ ద్వారా జరుగుతున్న ప్రయత్నం ఇది. ఎన్నికల్లో బీజేపీ గెలువడానికి సహాయపడింది’ అని బుధవారం ‘ఎక్స్’లో ఒక పోస్ట్ విడుదల చేశారు. ‘సర్’ కింద భారీ తొలగింపులపై సుప్రీంకోర్టు వెంటనే జోక్యం చేసుకోవాలన్నారు. ఇది ఎన్నికల్లో బీజేపీ గెలుపునకు దోహదపడే ఉద్దేశంతో ఉందన్నారు. జార్ఖండ్లో గొడ్డా జిల్లాలో బీజేపీ ఏజెంట్లు మైనారిటీ వర్గానికి చెందిన ఓటర్ల పేర్లను తొలగించడానికి ప్రయత్నిస్తున్నారంటూ వార్తా కథనాలు వెలువడగా, దీనిపై ఆయన పై విధంగా స్పందించారు.