కాన్పూర్, అక్టోబర్ 27: బాలీవుడ్ సినిమా దృశ్యం చూడటం వల్ల వచ్చిన ఆలోచనతో ఓ జిమ్ ట్రైనర్ తనతో సంబంధాన్ని కొనసాగిస్తున్న మహిళ(32)ను చంపి కాన్పూర్లోని ఖరీదైన ప్రాంతంలో పాతి పెట్టాడు. తనకు వేరొక మహిళతో నిశ్చితార్థం జరగడంపై సదరు మహిళ అభ్యంతరం చెప్పడంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు నిందితుడు విశాల్ సోనీని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడు ఇచ్చిన సమాచారం మేరకు మృతురాలు ఏక్తా గుప్తా శవాన్ని కాన్పూర్ జిల్లా జడ్జి అధికార నివాసం దగ్గర పోలీసులు వెలికి తీశారు. పోలీసుల కథనం ప్రకారం జూన్ 24న ఏక్తా గుప్తా విశాల్ సోనీతో జిమ్లో గొడవ పడింది.
కోపంతో విశాల్ ఆమెను కొట్టడంతో స్పృహ తప్పి పడిపోయింది. ఆమెను అతడు అక్కడి నుంచి తీసుకెళ్లడం సీసీటీవీలో రికాైర్డెంది. ఆ తర్వాత ఆమెను హత్య చేసిన నిందితుడు నగరంలోని ఖరీదైన ప్రాంతంలో పాతిపెడితే ఎవరికీ అనుమానం రాదని భావించి జిల్లా జడ్జి ఇంటికి సమీపంలో ఆమెను పూడ్చి పెట్టాడు. నిందితుడితో ఏక్తా గుప్తాకు వివాహేతర సంబంధం ఉందన్న విషయాన్ని ఆమె భర్త రాహుల్ గుప్తా నిరాకరించారు. ‘ఇది అపహరణ కేసు. నాలుగు నెలల్లో రెండుసార్లు మీడియా ద్వారా మేము కిడ్నాప్ సమాచారాన్ని అందించాం’ అని ఆయన చెప్పారు.