కన్నూరు: జపాన్‌లో నర్సింగ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న 22 ఏళ్ల కేరళ యువతి వీ.దేవిక బుల్లెట్ రైలు(Bullet Train) ఢీకొని మృతిచెందింది. ఈ ఘటన ఆమె ఫ్యామిలీలో తీవ్ర విషాదాన్ని నింపింది. జపాన్ వెళ్లేందుకు డబ్బు లేక, కూతురి మృతదేహాన్ని తీసుకురాలేక.. ఆమె పేరెంట్స్ అంతిమ వీడ్కోలు పలకలేకపోతున్నారు. అయితే జపాన్‌లో ఉన్న కేరళ సంఘం నిహన్ కైరేలీ .. దేవిక అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ దహనసంస్కారాలను హిందూ సంప్రదాయ ప్రకారం నిర్వహించనున్నారు. అయితే లైవ్‌స్ట్రీమింగ్ ద్వారానే పేరెంట్స్ తమ కూతురుకి తుది వీడ్కోలు పలకనున్నారు.
గిఫూలోని కాకమిఘరలో రైల్వే క్రాసింగ్ వద్ద బుల్లెట్ రైలు ఢీకొని దేవిక మృతిచెందింది. కేరళలోని ఇరిట్టిలోని పడియోర్ ఆమె స్వగ్రామం. ఐడెంటిటీ కార్డు ఆధారంగా దేవికను గుర్తించారు. గిపూలో ఉన్న ఓ సంక్షేమ సంస్థలో ఆమె పనిచేస్తున్నది. మూడేళ్ల కాంట్రాక్టుపై ఆమె మార్చిలోనే జపాన్ చేరుకున్నది. సెప్టెంబర్ 2వ తేదీ రాత్రి డబ్బులు విత్‌డ్రా చేసుకునేందుకు బయటకు వెళ్లిన దేవిక.. ఆ తర్వాత ఆచూకీ లేకుండాపోయింది. పేరెంట్స్ ఫోన్లో ప్రయత్నించినా ఆమె టచ్‌లోకి రాలేదు.
జాబ్ వత్తిడి ఉన్నట్లు తరుచూ దేవిక చెప్పినట్లు పేరంట్స్ వెల్లడించారు. స్థానిక చట్టాల ప్రకారం ఆమె ఒంటరిగా ఉంటోంది. బుల్లెట్ రైలు కింద పడి దేవిక ప్రాణాలు కోల్పోయినట్లు ఓ పోలీసు అధికారి తెలిపారు. ఇమ్మిగ్రేషన్ సమయంలో తీసుకున్న ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా.. దేవిక మృతదేహాన్ని గుర్తుపట్టనున్నారు. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి మొత్తం మూడు వారాలు పట్టనున్నది. పోలీసు, స్థానిక అధికారులు, ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ తర్వాత ఆమె మృతదేహాన్ని రిలీజ్ చేయనున్నారు. దహన సంస్కారాలు పూర్తి అయిన తర్వాత.. స్థానిక మళయాలీలు ఆమె చితాభస్మాన్ని పంపనున్నారు.