Kangana Ranaut : రైతుల నిరసనలను కట్టడి చేసేందుకు మోదీ ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టకుంటే ఇవి బంగ్లాదేశ్ తరహా అశాంతి పరిస్ధితులకు దారితీసే అవకాశం ఉందని బీజేపీ నేత, మండి ఎంపీ కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన పోరాటంలో మృతదేహాలు వేలాడుతూ కనిపించాయని, లైంగిక దాడులు చోటుచేసుకున్నాయని ఎక్స్ వేదికగా షేర్ చేసిన వీడియోలో ఆరోపించారు.
సాగు చట్టాలను వెనక్కితీసుకున్నా నిరసనలు కొనసాగేలా విదేశీ శక్తులు, స్వా్ర్ధప్రయోజనాలు ఆశించే వారు ప్రోత్సహించారని దుయ్యబట్టారు. బంగ్లాదేశ్లో ఏం జరిగిందో ఇక్కడ కూడా జరిగే అవకాశం ఉంది, విదేశీ శక్తులు ఇందుకు కుట్ర పన్నారని ఆమె ఆరోపించారు. దేశం కుక్కలపాలైనా వారికేం పట్టదని విమర్శించారు. బాలీవుడ్ క్వీన్ వ్యాఖ్యలు సొంత పార్టీలోనే దుమారం రేపాయి. పంజాబ్ సీనియర్ బీజేపీ నేత హర్జిత్ గరేవాల్ కంగనా రనౌత్ వ్యాఖ్యల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.
ఇలాంటి రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం మానుకోవాలని కంగనాకు హితువు పలికారు. రైతుల గురించి మాట్లాడే వ్యవహారం కంగనా రనౌత్ పని కాదని, వీటిని ఆమె వ్యక్తిగత వ్యాఖ్యలుగా పరిగణించాలని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ రైతులకు అనుకూలమని చెప్పుకొచ్చారు. విపక్ష పార్టీలు తమకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని, కంగనా ప్రకటన కూడా అలాగే ఉందని ఆయన అసహనం వ్యక్తం చేశారు. సున్నితమైన, మతపరమైన అంశాలపై ఆమె ఈ తరహా వ్యాఖ్యలు చేయడం మంచిది కాదని సూచించారు.కాగా, హరియాణ అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో కంగనా రనౌత్ వ్యాఖ్యలు బీజేపీ విజయావకాశాలపై ప్రభావం చూపుతాయని కమలనాధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Read More :
KTR | రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి.. కేటీఆర్ ట్వీట్