బెంగళూరు: కన్నడ భాషపై నటుడు కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలపై కన్నడిగలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని, ఆయనను, ఆయన చిత్రాలను నిషేధించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల చెన్నైలో జరిగిన థగ్ లైఫ్ ఆడియో రిలీజ్ ఫంక్షన్లో కమల్ మాట్లాడుతూ.. ‘తమిళం నుంచే కన్నడ పుట్టింది’ అని వ్యాఖ్యానించారు. కమల్ వ్యాఖ్యలను నిరసిస్తూ కర్ణాటకలోని మైసూర్, బెళగావి, హుబ్బళి, బెంగళూరు తదితర ప్రాంతాల్లో కన్నడ భాషాభిమాన సంస్థల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. పలు చోట్ల ఆయన దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు.
కర్ణాటక రక్షణ వేదిక ఆయనపై బెంగళూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కన్నడ భాషకు దీర్ఘకాలిక చరిత్ర ఉందని, కమల్ హాసన్ ఆ విషయం తెలియకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేశారని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. తన వ్యాఖ్యలపై వివాదం రేగిన క్రమంలో కమల్ హాసన్ స్పందించారు. కన్నడపై నేను చేసిన వ్యాఖ్యలు ప్రేమతో చేసినవని, దీనికి క్షమాపణ చెప్పనని అన్నారు.