కొలీజియంకు ముందే కేంద్రం నుంచి ఆమోదం!
న్యాయ నియామకాలకు సంబంధించి మాజీ సీజేఐ చంద్రచూడ్‌పై జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ వ్యాఖ్యలు..
- ఇది తప్పుడు సంకేతమేనని విమర్శ
- ‘వితవుట్ ఫియర్ ఆర్ ఫేవర్’ పుస్తకంలో ప్రస్తావన
న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) డీవై చంద్రచూడ్ తన అంచనాలకు అనుగుణంగా వ్యవహరించలేదని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ అన్నారు. ది వైర్ కోసం శనివారం కరణ్ థాపర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ‘వితవుట్ ఫియర్ ఆర్ ఫేవర్’ పేరుతో తన జ్ఞాపకాల పుస్తకాన్ని జస్టిస్ కౌల్ ప్రచురించారు. సీజేఐ చంద్రచూడ్ పదవీకాలంలో కౌల్ సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తిగా ఉన్నారు.
ఆ కాలానికి సంబంధించిన పలు కీలక విషయాలను ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. తన పుస్తకంలో జస్టిస్ కౌల్ పేర్కొన్న వివరాల ప్రకారం.. ఒక సందర్భంలో సుప్రీంకోర్టు కొలీజియం సమావేశం జరుగకముందే అప్పటి సీజేఐ డీవై చంద్రచూడ్ ప్రభుత్వం నుంచి ‘ఆమోదం’ కోరారు. మరో సందర్భంలో మైనారిటీ మతానికి చెందిన న్యాయమూర్తి అభ్యర్థి కులం ఏమిటని ప్రభుత్వం వేసిన ‘వింతైన’ ప్రశ్నను కూడా ఆయన ప్రస్తావించారు. ఇద్దరు అగ్ర న్యాయమూర్తుల మధ్య తరచూ విభేదాలు ఎందుకు వచ్చాయని అడిగినప్పుడు, సీజేఐ నుంచి తాను ఎక్కువ ఆశించానని జస్టిస్ కౌల్ తెలిపారు. ‘సంప్రదింపులు జరుపడం వేరు, నేను ‘ముందస్తు ఆమోదం’గా భావించినది వేరు.
అంటే కొలీజియం అధికారికంగా చర్చించకముందే ప్రభుత్వ అనుమతి కోరడం. ఇది తప్పుడు సంకేతాన్ని పంపుతుంది. రాజకీయ వర్గాలకు మీరు తలుపులో చిన్న అవకాశం ఇచ్చినా, వారు తమ ఆధిపత్యాన్ని చాటుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తారు. ఇది ఏ విధంగానూ రాజకీయ పక్షపాతానికి సంబంధించిన విషయం కాదు. అధికార సంబంధాల సహజ స్వభావానికి సంబంధించిన అంశం మాత్రమే’ అని ఆయన రాశారు. న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించి కొలీజియంలో జరిగిన చర్చల గురించి కూడా జస్టిస్ కౌల్ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఐదుగురు న్యాయమూర్తుల పేర్లపై కొలీజియం అంగీకారానికి వచ్చినప్పటికీ, చివరి నిమిషంలో ప్రతిపాదించిన ఆరో పేరును కూడా చేర్చాలని సీజేఐ కోరారని ఆయన తెలిపారు.
అయితే, ఆ ప్రతిపాదనకు తాను లేదా కొలీజియంలోని ఇతర సభ్యులు అంగీకరించలేదని చెప్పారు. ‘ఆరో పేరు సహా మిగిలిన పేర్లకు సంబంధించి ఆయన అప్పటికే ప్రభుత్వంతో ఏదో ఒక రకమైన ఆమోదం తీసుకుని ఉండవచ్చు’ అని జస్టిస్ కౌల్ అన్నారు. ‘దురదృష్టవశాత్తు, పేర్లను ముందుగానే చర్చించడం, ప్రభుత్వంతో ఒక రకమైన ముందస్తు సంప్రదింపులు జరుపడం ఇప్పుడు ఒక పద్ధతిగా మారింది. గతంలో కూడా ఇది జరిగేది. చంద్రచూడ్‌కు ముందు కూడా, ఆయన తర్వాత కూడా ఇది జరుగుతున్నదని నేను భావిస్తున్నాను. అందుకే ఈ విషయం నన్ను కలవరపెడుతున్నది’ అని ఆయన అన్నారు. 2015లో జాతీయ న్యాయ నియామకాల కమిషన్‌ను రద్దు చేసిన అంశంపై అన అభిప్రాయాన్ని కూడా ఆయన పుస్తకంలో వెల్లడించారు. ఆ కమిషన్‌కు పనిచేసే అవకాశం ఇచ్చి ఉండాల్సిందని తాను భావించినట్టు రాశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

