శ్రీనగర్: నిరసన చేస్తున్న మహిళను ఒక పోలీస్ అధికారి కాలితో తన్నాడు. (Police Officer Kicks Woman Protester) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆ పోలీస్ ఆఫీసర్ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో దర్యాప్తునకు ఆదేశించారు. జమ్ముకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో ఈ సంఘటన జరిగింది. గత నెలలో దేవసర్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులు అదృశ్యమయ్యారు. ఒక వ్యక్తి మృతదేహాన్ని వాగులో ఆదివారం గుర్తించారు. మూడు రోజుల కిందట అదే వాగులో అతడి సోదరుడి మృతదేహం లభించింది. మూడో వ్యక్తి కోసం ఇంకా గాలిస్తున్నారు.
కాగా, వాగులో మృతదేహాలు లభించడంపై బాధిత కుటుంబ సభ్యులు, ఆ ప్రాంత వాసులు ఆదివారం నిరసన చేపట్టారు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఒక పోలీస్ అధికారి తన అధికార దర్పాన్ని ప్రదర్శించాడు. నిరసన చేస్తున్న మహిళను కాలితో తన్నాడు.
మరోవైపు పీడీపీ నాయకురాలు ఇల్టిజా ముఫ్తీ ఆ పోలీస్ అధికారి తీరును విమర్శించారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఈ వీడియో క్లిప్‌ను ఎక్స్‌లో షేర్ చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో పోలీస్ శాఖ స్పందించింది. ఆ అధికారి ప్రవర్తనకు సంబంధించిన ఆరోపణలను పరిశీలించినట్లు కశ్మీర్ జోన్ పోలీస్ విభాగం తెలిపింది. దీనిపై విచారణకు ఆదేశించినట్లు ఎక్స్‌లో పేర్కొంది.
Shocking & unbecoming for a policeman to kick a woman only because she was peacefully protesting against the mysterious deaths in Devsar Kulgam. It is this high handed behaviour from officers expected to uphold law that creates a trust deficit alienating people even further.… pic.twitter.com/gNnINibcBR
— Iltija Mufti (@IltijaMufti_) March 16, 2025