Hemant Soren | రాంచీ: జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ శనివారం తన పుట్టిన రోజు సందర్భంగా జైల్లో తన చేతిపై వేసిన ‘ఖైదీ’ ముద్రను ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఇది నా చేతిపై వేసిన స్టాంపే కాదు, దేశ ప్రజాస్వామ్యం ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లకు ఒక చిహ్నమని ఆయన పేర్కొన్నారు. ఇటీవల జైలు నుంచి విడుదలవుతున్న సమయంలో జైలు అధికారులు తన చేతిపై ఈ ముద్ర వేశారని తెలిపారు. ఎలాంటి ఆధారాలు, ఫిర్యాదులు, నేరం లేకుండా ప్రజలు ఎన్నుకొన్న ఒక సీఎంగా ఉన్న తనను 150 రోజుల పాటు జైల్లో ఉంచారని అన్నారు.
తన పరిస్థితే ఇలా ఉంటే.. ఇక సామాన్య గిరిజనులు, దళితులు, అణగారిన వర్గాల ప్రజల విషయంలో ఏ విధంగా వ్యవహరిస్తారో ఇక చెప్పనవసరం లేదని అన్నారు. ఈ రోజు నుంచి అన్ని వర్గాల ప్రజల హక్కుల కోసం మరింత సమర్థవంతంగా పోరాడాలని సంకల్పించుకొన్నానని పేర్కొన్నారు. మతం, కులం, రంగు, అలవాట్లు ఇతరత్రా ఆధారంగా అణచివేత, అన్యాయానికి గురైన ప్రతి వ్యక్తి, ప్రతి వర్గం తరపున తాను గొంతెత్తుతానని సొరేన్ తెలిపారు. చట్టం అందరికీ సమానమనేలా, అధికార దుర్వినియోగం లేని సమాజాన్ని నిర్మించుకొనేందుకు ప్రజలంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు.