బెంగళూరు: కర్ణాటకకు చెందిన జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్డీ రేవణ్ణకు (HD Revanna) సోమవారం బెయిల్ లభించింది. ఆయన కుమారుడు, హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు ప్రమేయం ఉన్న లైంగిక వేధింపుల బాధితురాలి కిడ్నాప్ కేసులో బెంగళూరు కోర్టు షరతులతో బెయిల్ మంజూరు చేసింది. రూ.5 లక్షల బాండ్, అంతే మొత్తానికి రెండు షూరిటీలు సమర్పించాలని హెచ్డీ రేవణ్ణను కోర్టు ఆదేశించింది. అలాగే సిట్ దర్యాప్తునకు సహకరించాలని, ఆధారాల దుర్వినియోగానికి పాల్పడ వద్దని కోర్టు పేర్కొంది.
కాగా, మహిళ కిడ్నాప్‌పై ఆమె కుమారుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) హెచ్డీ రేవణ్ణను ఈ నెల 4న అరెస్ట్ చేసింది. జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని, తండ్రి హెచ్డీ దేవెగౌడ నివాసం నుంచి ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత కోర్టులో ప్రవేశపెట్టగా మూడు రోజులు సిట్ కస్టడీకి అప్పగించింది. అనంతరం ఈ నెల 14 వరకు జ్యూడిషల్ కస్టడీ విధించడంతో జైలుకు తరలించారు. అయితే ఆ గడువుకు ఒక రోజు ముందే హెచ్డీ రేవణ్ణకు బెయిల్ లభించింది.