న్యూఢిల్లీ: ఇటీవల ముగిసిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో రాజ్యసభ ఎంపీ జయాబచ్చన్.. తన పేరు విషయంలో అసహనాన్ని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. జయా అమితాబ్ బచ్చన్ అంటూ చైర్మెన్ ధన్కడ్ పిలవడాన్ని జయా తప్పుపటారు. కేవలం తనను జయా బచ్చన్ అని పిలుస్తే సరిపోతుందని ఆమె పేర్కొన్నారు. ఆ ఘటన పట్ల నటి, ఎంపీ కంగనా రనౌత్(Kangana Ranaut) స్పందించారు. ఎమర్జెన్సీ ఫిల్మ్ ప్రమోషన్లో పాల్గొన్న కంగనా ఆ టాపిక్‌పై రియాక్ట్ అవుతూ.. పార్లమెంట్లో చోటుచేసుకున్న జయాబచ్చన్ పేరు వివాదం ఓ చిన్నపాటి ఇష్యూ అని కొట్టిపారేశారు.
ఇది సిగ్గుపడాల్సిన అంశమని, పురుషుడు-మహిళ మధ్య ఉన్న సహజ వైరుధ్యాన్ని ఓ వివక్షగా చూస్తున్నారని కంగనా పేర్కొన్నారు. ప్రస్తుతం ఫెమినిస్ట్ ఉద్యమం తప్పుదోవలో వెళ్తోందన్నారు. పురుషుడు పురుషుడే అని, మహిళ మహిళే అని, ఇద్దరూ ఒక్కటి అవ్వడం అద్భుతమని, కానీ పార్లమెంట్లో జరిగింది ఓ పనికిమాలిన విషయమని, ఫెమినిజం పేరుతో ప్రజలు తప్పుడుమార్గంలో వెళ్తున్నారని, సమాజం కూడా చెడు మార్గంలో వెళ్తోందని కంగనా తెలిపారు.
జయాబచ్చన్ గుర్తింపు కోసం పాకుడలాడడం ఆమె అహంకారాన్ని సూచిస్తున్నదని కంగనా ఆరోపించారు. ఆ అహంకారం కుటుంబంలోని అందమైన బంధాన్ని కూడా దూరం చేస్తుందని, మనుషులు ఒక్కర్ని ఒకరు ప్రేమించుకోవాలని, కానీ ఇలా కఠినత్వంతో దూరం కావొద్దు అన్నారు. పూర్తి పేరు చెప్పడం వల్ల కొందరు ఊరికే కోపానికి గురవుతున్నారని, తమ గుర్తింపు కోల్పోయినట్లు బాధపడుతున్నారని కంగనా ఆరోపించారు.