లక్నో: ఒక భార్య తన భర్తకు చెందిన డబ్బు, బంగారు నగలను చోరీ చేసింది. (woman steals from husband) ఇంటి నుంచి ఆమె పారిపోయింది. ఫేస్బుక్లో పరిచయమైన ప్రియుడ్ని కలిసి అతడ్ని పెళ్లాడింది. ఈ విషయం తెలుసుకున్న భర్త అక్కడకు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌కు చెందిన అబిరాల్కు 2017లో పంజాబ్‌లోని మొహాలికి చెందిన వినోద్ కుమార్‌తో వివాహమైంది. అయితే ఉత్తరప్రదేశ్‌లోని రాయ్ బరేలీకి చెందిన ఫైజాన్ అహ్మద్ ఫేస్బుక్లో ఆమెకు పరిచయమయ్యాడు. దీంతో వారిద్దరి మధ్య ప్రేమ సంబంధం ఏర్పడింది.
కాగా, గత ఏడాది డిసెంబర్లో భర్త ఇంటి నుంచి అబిరాల్ పారిపోయింది. వినోద్ కుమార్‌కు చెందిన రూ.2 లక్షల డబ్బు, బంగారు ఆభరణాలు, మొబైల్ ఫోన్‌తో సహా రూ.5 లక్షల విలువైన వాటిని అపహరించి తన వెంట తీసుకెళ్లింది. ఉత్తరప్రదేశ్‌లోని రాయ్ బరేలీకి ఆమె చేరుకున్నది. ఫేస్బుక్ లవర్ ఫైజాన్ అహ్మద్‌ను కలిసింది. రెండు రోజుల తర్వాత వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు.
మరోవైపు అబిరాల్ భర్త వినోద్ కుమార్‌కు ఈ విషయం తెలిసింది. దీంతో అతడు రాయ్ బరేలీకి చేరుకున్నాడు. జనవరి 7న అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డబ్బు, బంగారంతో తన భార్య ఇంటి నుంచి వెళ్లిపోయేందుకు అహ్మద్ పురిగొల్పినట్లు ఆరోపించాడు. అయితే ప్రియుడితోనే తాను ఉంటానని పోలీసులకు అభిరాల్ చెప్పింది. దీంతో ఆమె భర్త ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.