మ్యూనిక్, ఫిబ్రవరి 15: భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పశ్చిమ దేశాల వైఖరిని ఎండగట్టారు. మ్యూనిక్ భద్రతా సదస్సులో శనివారం ఆయన ప్రజాస్వామ్యంపై మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్న అభిప్రాయంతో తాను ఏకీభవించనని చెప్పారు. భారతదేశ ప్రజాస్వామ్య విజయాలను ఆయన వివరించారు. ప్రజాస్వామ్యం కూర్చుని తిండి పెట్టదంటూ అమెరికా సెనేటర్ స్లోట్కిన్ చేసిన వ్యాఖ్యలకు జైశంకర్ స్పందిస్తూ తమది ప్రజాస్వామిక సమాజం అయినందున 80 కోట్ల మంది జనాభాకు పౌష్టికాహారం లభిస్తోందని చెప్పారు. తమ దేశంలో ప్రజలు కడుపునిండా తిండి తినగలుగుతున్నారంటే అది ప్రజాస్వామ్య గొప్పదనమేనని ఆయన అన్నారు. తన చూపుడు వేలికి ఉన్న సిరా చుక్కను చూపిస్తూ ఇది ఇటీవల తన రాష్ట్రం(ఢిల్లీ)లో జరిగిన ఎన్నికలలో తాను ఓటు వేసిన గుర్తని ఆయన అన్నారు.