న్యూఢిల్లీ : భారత రాజ్యాంగ ప్రవేశికలో ‘లౌకికవాదం, సామ్యవాదం’ పదాలను చేర్చడంపై ఆరెస్సెస్ నేత దత్తాత్రేయ హొసబలే చేసిన వ్యాఖ్యలు అధికార, విపక్షాల మధ్య విమర్శలకు తెర లేపాయి. హోసబలె వ్యాఖ్యలకు మద్దతుగా ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ స్పందించగా, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి అటు కాంగ్రెస్ను, ఇటు బీజేపీని దుయ్యబట్టారు. శనివారం జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన ధన్కర్ ఆరెస్సెస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హొసబలే వ్యాఖ్యలకు మద్దతుగా మాట్లాడారు. దేశంలో అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్న కాలంలో రాజ్యాంగ ప్రవేశికలో సామ్యవాద, లౌకిక, అఖండత పదాలను చేర్చడం న్యాయ విరుద్ధమైన, హాస్యాస్పద చర్య అని వ్యాఖ్యానించారు. దీనిపై బీఎస్పీ అధినేత్రి లక్నోలో విలేకరులతో మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ సర్కార్, ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వం రాజ్యాంగంలో అనవసరమైన మార్పులను చేస్తున్నాయన్నారు. రాజ్యాంగ ప్రవేశికలో రాసిన, వ్యక్తం చేసిన మౌలిక స్ఫూర్తి, లక్షణాలను మార్చకూడదని కోరారు.
మనుస్మృతిని రుద్దాలనే…
ధన్కర్ వ్యాఖ్యలపై కర్ణాటక సీఎం సిద్దరామయ్య మాట్లాడుతూ, ఆరెస్సెస్ మనుస్మృతిని నమ్ముతుందని, భారత రాజ్యాంగంపై దానికి గౌరవం లేదని, ఆ సంస్థ దేశంపై మనుస్మృతిని రుద్దాలనుకుంటున్నదన్నారు.