న్యూఢిల్లీ: కొందరు వ్యక్తులు తరచూ తప్పుడు లేదా వివేకం లేని నిర్ణయాలు తీసుకుంటుండటం మనకు తెలుసు. దీనికి కారణాల్లో ఒకటి కొన్ని జీవ సంబంధిత సంకేతాలకు మెదడు స్పందించే తీరు అని తాజా అధ్యయనంలో తేలింది. వ్యక్తులు నిర్ణయాలు తీసుకునేటపుడు ఆధారపడే జీవ సంబంధిత సంకేతాలు ఆ నిర్ణయాల ఫలితాలు మంచివా? చెడ్డవా? అనే విషయాన్ని నిర్ధారిస్తాయని పరిశోధకులు చెప్తున్నారు. జియెసెప్పె డి పెల్లెగ్రినో నేతృత్వంలో బోలోగ్న విశ్వవిద్యాలయం సైన్ ట్రాకర్స్, గోల్ ట్రాకర్స్ అనే రెండు రకాల నిర్ణేతలపై ఈ అధ్యయనం దృష్టి సారించింది. సైన్ ట్రాకర్స్ అంటే.. ఒక వ్యక్తి ఆరోగ్యం, ప్రవర్తన, శారీరక మార్పులను గమనించి, నమోదు చేయడం. గోల్ ట్రాకర్స్ అంటే.. లక్ష్య సాధన పర్యవేక్షణ. సైన్ ట్రాకర్స్‌ను ప్రతిఫలాన్ని సూచించే సంకేతాలు ఆకర్షిస్తాయి. అందువల్ల ఆ సంకేతాల వైపు సైన్ ట్రాకర్స్ కదులుతాయి. గోల్ ట్రాకర్స్ ఈ సంకేతాలను పట్టించుకోకుండా, నేరుగా ప్రతిఫలం వైపు వెళ్తాయి. పరిసరాల్లో ఉండే బొమ్మలు, శబ్దాలు వంటి సంకేతాలపై ఎక్కువగా ఆధారపడేవారు తమ నమ్మకాలను ప్రస్తుత పరిస్థితికి అనుగుణంగా సవరించుకోవడం కాని, నేర్చుకున్న పాత అలవాట్లు/అనుబంధాలను మార్చుకోవడం కాని కష్టమవుతుంది.