Income Tax | న్యూఢిల్లీ, మార్చి 29: కొత్త ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్ 1, 2025) నుంచి ఆదాయ పన్ను(ఐటీ) శాఖ అధికారులు ప్రజలకు సంబంధించిన డిజిటల్ కమ్యూనికేషన్ ప్లాట్‌ఫారాలైన వాట్సాప్, టెలిగ్రామ్, ఈ-మెయిల్ అకౌంట్లపై నిఘా పెట్టనున్నారు. ఆదాయపు పన్ను చట్టం, 2025 నిబంధనల ప్రకారం ప్రజలకు చెందిన ఈ కమ్యూనికేషన్ ప్లాట్‌ఫారాల ఖాతాలపై ప్రభుత్వం డేగ కన్ను వేసి అక్రమ ఆర్థిక లావాదేవీల ఆట కట్టించనున్నది. ఈ సంవత్సరం ఫిబ్రవరి 13న లోక్‌సభలో ఈ బిల్లును ఎందుకు ప్రవేశపెట్టాల్సి వచ్చిందో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మార్చి 27న సభ్యులకు వివరించారు. ఈ చట్టం ప్రకారం లెక్కల్లో చూపని నగదు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై నిఘా పెట్టేందుకు ప్రభుత్వానికి అనుమతి ఉంటుంది.
పాత చట్టంలోని దాదాపు అన్ని నిబంధనలు కొత్త చట్టంలో కూడా ఉంటున్నప్పటికీ భాషను సరళతరం చేయడం కొత్త చట్టం ప్రధాన లక్ష్యమని నిర్మలా సీతారామన్ తెలిపారు. డిజిటల్ ఖాతాలలో లభించే సాక్ష్యాలను పన్ను ఎగవేత నిరూపణకు సాక్ష్యాలుగా అధికారులు కోర్టులలో సమర్పించడానికి అవకాశం ఉటుంది. ఇటీవల మొబైల్ ఫోన్ల లో ఎన్‌క్రిప్ట్ అయిన(భద్రపరిచిన) మెసేజ్‌లు రూ. 250 కోట్ల లెక్కల్లో చూపని ధనం వెలికితీతకు దారి చూపాయి. వాట్సాప్ మెసేజెస్ ద్వారా క్రిప్టో ఆస్తుల గుర్తింపు జరిగింది. రూ.200 కోట్ల లెక్కల్లో చూపని ధనం వెలికితీతకు వాట్సాప్ కమ్యూనికేషన్ తోడ్పడిందని నిర్మల తెలిపారు. గూగుల్ మ్యాప్స్ హిస్టరీ సాయంతో నల్ల ధనాన్ని దాచేందుకు తరచూ సందర్శించిన ప్రదేశాలను గుర్తించడం జరిగినట్టు ఆమె వెల్లడించారు. బినామీ ఆస్తుల యజమానిని నిర్ధారించేందుకు టెలిగ్రాం ఖాతాలను విశ్లేషించినట్టు మంత్రి తెలిపారు.